CM KCR meeting with officials in Pragati Bhavan:దిల్లీ నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్, రామకృష్ణరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు.
ఈ సందర్భంగా పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. హైదరాబాద్ ప్రపంచ హరితనగరంగా పురస్కారం పొందడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. అధికారులకు అభినందనలు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన సమీక్ష నాలుగోరోజూ కొనసాగింది. హరిత నగర ఖ్యాతిని నలుదిశలా చాటేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.
ముగిసిన దిల్లీ పర్యటన: సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన బుధవారం ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం యూపీలో ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, అక్కడ్నుంచి నేరుగా దిల్లీకి వెళ్లారు. పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఎంపీలతో చర్చలు జరిపారు. భారాస కార్యాలయ పనులను పరిశీలించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై ఈ సందర్భంగా చర్చించారు.
ఇవీ చదవండి: రేవంత్ రెడ్డి గుర్రంపై స్వారీ.. సూపర్ కదా!!
రూ.49తో డ్రీమ్11లో బెట్టింగ్.. గిరిజనుడికి కోటి జాక్‌పాట్!