CM KCR Meeting with Collectors at Secretariat : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. పాదయాత్రలు, ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభల పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంటే... ప్రధాన ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, బీజేపీలు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ పోరాటాలు ఉద్ధృతం చేశాయి.
CM KCR Review Meeting with Collectors : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నూతన సచివాలయం ప్రారంభం అయినప్పటి నుంచి వరుస సమీక్షలతో బీజీబీజీగా గడుపుతున్నారు. మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు ప్రజాసమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నాయకులను తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల మధ్యనే ఉండాలని సూచిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలు చర్చించుకునేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు జరిపేలా షెడ్యూల్ను రూపొందించారు.
CM KCR on Telangana Decade Celebrations : జూన్ రెండో తేదీ నుంచి 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు ఒకరంగం చొప్పున ప్రగతి ప్రస్థానాన్ని వివరించేలా కార్యక్రమాలు రూపొందించారు. గ్రామస్థాయి మొదలు రాజధాని వరకు ఊరూవాడ వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధంచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను వేడుకల్లో భాగస్వాములను చేస్తూ ఉత్సవాలు నిర్వహించటంపై పలు సూచనలు చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం : పోడు భూముల పట్టాల పంపిణీపై కూడా చర్చ జరుగుతోంది. దాదాపు 4లక్షల ఎకరాల పోడు భూములకు.. జూన్ 24వ తేదీ నుంచి పట్టాలు పంపిణీ చేయనున్నారు. భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా వాటి పరిరక్షణలో అందరిని భాగస్వాములను చేయడం సహా లబ్ధిదారుల హామీ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గ్రామాల్లో మిగిలిపోయిన నివాసయోగ్యమైన భూములను అర్హులైన పేదలకు నివాసస్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో స్థలాలు, అర్హులైన పేదల గుర్తింపు, పట్టాలపంపిణీపై కూడా కలెక్టర్ల సదస్సులో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.
కలెక్టర్ల సదస్సులో వాటిపైనా చర్చ : తొమ్మిదో విడత హరితహరంపైనా ఈ భేటీలో చర్చ జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్నిగ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు. 9వ విడతలో మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై ఇవాళ్టి సదస్సులో సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. ఇతర పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై కూడా కలెక్టర్ల సదస్సులో చర్చ జరగుతోంది.
ఇవీ చదవండి :