CM KCR Maharashtra Tour Updates : భారత్ రాష్ట్ర సమితి.. మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూరే సరైన వేదికని తొలి నాళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పేవారు.
ఈ క్రమంలోనే ఇటీవల జూన్ 15న మహారాష్ట్రలోని నాగపూర్‌లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందిగా చెప్పుకోవచ్చు.
CM KCR to Visit Pandaripur Temple in Maharashtra : ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 600 కార్లతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌గా తరలివెళ్తున్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరనున్న పలువురు మరాఠా నేతలు : సీఎం నేడు సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. సోలాపూర్ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం సోలాపూర్ జిల్లాలోని పండరీపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హైదరాబాద్‌కు రోడ్డుమార్గాన చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు మంచి ఆదరణ : ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరగా.. భీవండి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన పలువురు నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం గులాబీ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎన్సీపీ మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి అరిఫ్ అజ్మీ, ఫజిల్ అన్సారీ, భీవండి కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త ఇర్ఫాన్ మోమిన్, కాంగ్రెస్ నేత, ఎన్జీవో సీనియర్ నాయకుడు అర్ఫత్ షేక్, ఎన్సీపీ థానే జిల్లా ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్ ఉన్నారు.
ఇవీ చదవండి :