CM KCR Inspects New Secretariat Works: హైదరాబాద్‌లో రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలన ముగిసింది. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సచివాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్.. ఇంజినీర్, అధికారులతో సెక్రటేరియట్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Telangana New Secretariat :నూతన సచివాలయం ఆరో అంతస్తులో కేసీఆర్ క్యాబిన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన గదికి సంబంధించిన పనులను పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం భవనం పనులు ఎంత వరకు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత మేరకు పూర్తికావాల్సి ఉందని అనే అంశాలను కేసీఆర్ పరిశీంచారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.
Telangana New Secretariat Inauguration : 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 6 అంతస్తుల మేర నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నూతన సచివాలయన్ని గత నెల ఫిబ్రవరి 17న.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఆ తర్వాత మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల మరోసారి వాయిదా వేశారు. ప్రస్తుతం తుదిదశలో ఉన్న నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్ రెండులోగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
మరోవైపు హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా.. ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆలోగా పనులను పూర్తిచేసేలా అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి.. సకాలంలో పూర్తిచేయ్యేలా చూడాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించటంతోపాటు భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.