CM KCR Inspected The Development Works: రాష్ట్ర సచివాలయం ముందు అభివృద్ధి చేస్తున్న కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం ముందు కూడలి అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని ఆరా తీసిన ఆయన.. విశాలమైన పచ్చిక బయలు ఉండేలా సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కూడలి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని.. రెండు వైపులా పెద్ద ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి..: గతంలో ఆ ప్రాంతంలో తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలతో పాటు పెద్దపెద్ద చెట్లు ఉండేవి. రహదారులు, కూడళ్ల విస్తరణ సమయంలో వాటిని అక్కణ్నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ల్యాండ్ స్కేపింగ్ అభివృధి చేస్తున్నారు. పచ్చిక బయలు మధ్యలో తెలుగుతల్లి విగ్రహం, ఇరువైపులా ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీఆర్కే భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కూడా సీఎం పరిశీలించారు.
CM Inspected Development Works : ఆ ప్రాంతాన్ని కూడా ల్యాండ్ స్కేపింగ్ చేసి కూడలిగా అభివృద్ధి చేయాలని.. మధ్యలో ఫౌంటెయిన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బీసీ కులవృత్తులకు ఆర్థికసాయానికి సంబంధించి విధివిధానాలను 2 రోజుల్లో ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కసరత్తును వివరించారు. 2 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. రూ.లక్ష చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన విధివిధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతకు ముందు మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోమారు సమావేశమైంది. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అధికారులు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు.
మరోవైపు హైదరాబాద్ గోపన్‌పల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 31న ప్రారంభం కానుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్త్తో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, అర్చకులు, పీఠాధిపతులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఇవీ చదవండి: