CM KCR Review on Agriculture : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంభిస్తోందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న రైతులను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టట్టిందని ఆక్షేపించారు. పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తుండడం బాధాకరమని అన్నారు. వ్యవసాయరంగం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం... ఎరువులు, విత్తనాల అందుబాటు, వానాకాలం ముందస్తు ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని... అందులో కలెక్టర్లు, ఆర్డీఓలను కూడా భాగస్వాములను చేయాలని సీఎం చెప్పారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. సమైక్య పాలనలో నామ మాత్రంగా ఉన్న వ్యవసాయ రంగం... ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో జీఎస్డీపీకి 21 శాతం దోహదపడుతోందని, ఇది మామూలు విషయం కాదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారిందన్నారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తుందని, ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరవు అనే సమస్యే ఉత్పన్నం కాదని సీఎం స్పష్టం చేశారు.
ఎరువుల నిల్వలపై ఆరా తీశారు. యూరియా, డీఏపీ తదితర ఎరువుల నిల్వలు చాలినంతగా ఉన్నాయని అధికారులు తెలిపారు. డీఏపీ తయారీలో వినియోగించే ముడిసరుకులు రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయని... యుద్ధం నేపథ్యంలో డీఏపీ లభ్యత అవసరానికి మించి ఉండబోదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో విచ్చలవిడిగా డీఏపీ వాడకాన్ని తగ్గించి తగు మోతాదులో పొదుపుగా వాడుకోవాలనే విషయమై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. భూసారాన్ని పెంచే దిశగా కార్బన్ కంపోనెంట్ల వాడకాన్ని వినియోగించాలని, పచ్చిరొట్ట వాడాకాన్ని పెంచాలని అన్నారు.
వరిపంటను విపరీతంగా వేయడం ద్వారా భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్న శాస్త్రీయ అధ్యయనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లాభదాయక పంటలను ఎంచుకుని పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్య పరచాలని అధికారులకు సీఎం సూచించారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ పత్తికి డిమాండు పెరుగుతోందని సమావేశంలో చర్చించారు. క్వింటాల్ పత్తికి పది నుంచి 13వేల వరకు ధర పలుకుతోందని... రానున్న కాలంలో పత్తికి గిరాకీ ఇంకా పెరగనుందని అభిప్రాయపడ్డారు. పత్తి పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని అన్నారు.
మిర్చికి ఊహించని రీతిలో క్వింటాలుకు 42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయమన్న సీఎం... మార్కెట్లో డిమాండు ఉన్న కందిసాగు విషయంలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణాన్ని పెంచాలని తెలిపారు. వరిసాగులో వెదజల్లుడు విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా ఖర్చు తగ్గించవచ్చని కేసీఆర్ అన్నారు. ఎరువుల వాడకం, వరి వెదజల్లడం తదితర వ్యవసాయ అంశాలకు సంబంధించి రైతులను చైతన్యపరిచే దిశగా డాక్యుమెంటరీలు, ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
కల్తీ విత్తన తయారీ దారులు, వారి మూలాలను గుర్తించి కట్టడి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని... ఇప్పట్నుంచే ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలని వ్యవసాయశాఖకు సూచించారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలని అన్నారు. ఏఈఓలకు అవగాహన పెంపొందించాలని... నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించాలని మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్ ఛార్ట్ తయారు చేయాలని సీఎం చెప్పారు.
వరి ధాన్యం సేకరణ పురోగతిపై అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 536 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ పుంజుకుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,983 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలైందని... ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే... కానీ: గవర్నర్