CM KCR on Central Government: కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణకు గుదిబండలా మారిందని, రాష్ట్రం సాధించినప్పటికీ హక్కుల సాధనకు కూడా కేంద్రంతో పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా తెలంగాణ ఉన్న సమయంలో సమైక్య పాలకులు వివక్ష చూపారని, ఇప్పుడూ అదే వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే తెలంగాణ ప్రజలకు నూకలు తిన్పించడం అలవాటుచేయాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని ఆక్షేపించారు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు ఎదురవుతున్నా రాష్ట్రం ప్రగతిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రాలను బలహీనపరిచే కుట్ర
‘‘దేశంలో బలమైనది కేంద్రం.. బలహీనమైనవి రాష్ట్రాలు అనేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్ఠకు చేరింది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలో భాగంగా ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులనూ కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని స్వయంగా అనేకమార్లు ప్రధానికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనా విజృంభించిన క్లిష్ట సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు నయాపైసా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా రావాల్సిన నిధుల్లో కోత విధించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట రైల్వే కోచ్‌ల కర్మాగారం విషయంలో అతీగతీ లేదు. తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను పునర్‌విభజన చేయాలని స్పష్టంగా పేర్కొంది. అయినా అధికారంలో ఉన్న కేంద్రం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని మా ప్రభుత్వం ఖండిస్తోంది. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు దేశంలోనే వైద్యవిద్య కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి స్వయంగా లేఖ రాశా. తెలంగాణ విద్యార్థులకయ్యే ఖర్చును భరించడానికి సిద్ధమనీ చెప్పా. కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఇలాంటి అనేక అంశాల్లో కేంద్రం వైఖరిని రాష్ట్రం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
నిరంకుశ పోకడలు మరింత పెరిగాయ్
75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కూడా దేశంలో అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగాయి. అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతోంది. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గాల్లో దీపమైంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసిన సర్కారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారైంది.
విద్యుత్ సంస్కరణలను అంగీకరించబోం
కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా రూ.ఐదు వేల కోట్లు సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆ సొమ్ముకోసం ఆశిస్తే రైతుల పొలాల వద్ద మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతులపై భారం మోపే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు.
విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాటం అందరి బాధ్యత
నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. భారత్‌లో ప్రగతి పరుగులు తీయాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగిన వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా మనందరి బాధ్యతే.
పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీ లేదు
రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలో అత్యంత అభివృద్ధిని సాధించి, తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుత్వం పొందింది. చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రజాసమస్యల పరిష్కారంపై శ్రద్ధ, పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో మానవీయ కోణం, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడింది. తద్వారా అనతి కాలంలోనే అద్భుతమైన సంపద సృష్టించాం. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకు అనుగుణంగానే దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎనిమిదేళ్లలో వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచాం. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. ఐటీ, పారిశ్రామిక రంగాలలో అప్రతిహతంగా ముందుకెళ్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగా 80 వేలకుపైగా ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయని తెలిపారు.
విద్వేషాలు, మత ఘర్షణలతో విచ్ఛిన్నమే
ఇప్పడు దేశం ప్రమాదంలో ఉంది. మతపిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే సమాజ ఐక్యతకు విఘాతం ఏర్పడుతుంది. అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. ఉన్నవీ వెనక్కు మళ్లుతాయి. ఈ విద్వేషకర వాతావరణం నుంచి దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి.
అభివృద్ధిలో అప్పటికీ, ఇప్పటికీ పోలికే లేదు
ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం, విద్యుత్ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగం సహా అన్ని అంశాల్లో రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు పోలికే లేదు. అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా అండదండలు అందిస్తుంది. ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలని, ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలనేదే నా ఆకాంక్ష.- సీఎం కేసీఆర్
ఇవీ చదవండి: