CM KCR Exercise on Budget: త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పద్దుపై చర్చించారు. 2022-23 ఆర్థిక సంవత్సరపు ఆదాయవ్యయాలను సమీక్షించారు. కొత్త కేటాయింపుల ప్రాధాన్యాల గురించి చర్చించినట్లు తెలిసింది.
వచ్చే నెల 3న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున అంత కంటే ఐదు రోజుల ముందే రూపకల్పన పూర్తి కావాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారని సమాచారం. కొత్త బడ్జెట్ (2023-24)లో తమ పద్దును 15 శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. 2022-23 బడ్జెట్‌లో రూ.3,496 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.4,025 కోట్లకు పెంచాలని అభ్యర్థించింది.
CM KCR Exercise on Designing Budget: 2022-23లో పారిశ్రామిక రాయితీలకు రూ.2,519 కోట్లు ఇవ్వగా.. కొత్త బడ్జెట్‌లో దీన్ని రూ.3వేల కోట్లకు పెంచాలని సిఫార్సు చేసింది. పారిశ్రామిక మౌలిక వసతులకు మరోసారి పెద్దపీట వేయాలని కోరింది. అంకురాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు, నవీన సాంకేతికతలకు నిధులను రెట్టింపు చేయాలని కోరింది. పరిశ్రమల బడ్జెట్‌పై ఇటీవల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా 2022-23 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల వినియోగంపై చర్చించింది. జనవరి మాసాంతం వరకు 85 శాతం నిధులను వినియోగించినట్లు అధికారులు నివేదించారు. మార్చి నెలాఖరుకు పూర్తిస్థాయిలో నిధుల వినియోగం జరుగుతుందని వెల్లడించారు. నిధుల వినియోగం ప్రాతిపదికన కొత్త కేటాయింపుల కోసం సిఫార్సులు చేయాలని మంత్రి నిర్దేశించారు. దీనికి అనుగుణంగా కొత్త బడ్జెట్ ప్రతిపాదనలను పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది.
రాయితీలకు ప్రతిపాదనలు: రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో వాటికి రాయితీలు, ప్రోత్సాహకాల కోసం డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడులు పెరిగినందున తదనుగుణంగా రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ మేరకు పెట్టుబడులు, విద్యుత్, పావలా వడ్డీ తదితర రాయితీలు ఇవ్వాలని.. వీటికి అవసరమైన నిధులను ప్రతిపాదనల్లో పేర్కొంది.
కొత్త పరిశ్రమల కోసం పారిశ్రామిక పార్కుల్లో, సమూహాల్లో మౌలిక సదుపాయాలు అవసరమైనందున వాటికి నిధులను పెంచాలని సూచించింది. అంకురాల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. వాటికి సాంకేతికత, పెట్టుబడుల సాయంతో పాటు జిల్లాల్లో ఇంకుబేటర్లు, మినీ టీహబ్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులను కోరింది.
- రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్ల ఏర్పాటు దృష్ట్యా వాటికి సాయం కోసం రూ.150 కోట్లను సిఫార్సు చేసింది. ఔషధనగరి, పారిశ్రామిక నడవాలకు భూసేకరణ ఇతర అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది.
- చేనేత, జౌళి విభాగాలకూ కేటాయింపులను పెంచాలని కోరింది. బతుకమ్మ చీరలు, చేనేత, నేత కార్మికులకు ప్రోత్సాహకాలు, ఆర్థికసాయం, బీమా సాయం, నేతన్నలకు బీమా పథకాలకు ఈసారి నిధుల పెంపుదలను ప్రతిపాదించింది. హస్తకళల అభివృద్ధికి రూ.12 కోట్లు కేటాయించాలని కోరింది.
ఇవీ చదవండి: