తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాఠోడ్, జూపల్లి కృష్ణారావు, బొంతు రామ్మోహన్, కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, తెలంగాణ గల్లీ నుంచి దిల్లీ పాటల సీడీలను కేటీఆర్ ఆవిష్కరించారు.
జలవిహార్‌లో..
హైదరాబాద్ జలవిహార్‌లో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ కేకే తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ..
బంగారు తెలంగాణ రూపకల్పనలో కేసీఆర్ శ్రమ వెలకట్టలేదని నేతలు కొనియాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ జీవిత విశేషాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారు చీర
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను సమర్పించారు. తెరాస నేత కూన వెంకటేశ్‌గౌడ్, మరో దాతతో కలిసి కోటన్నర విలువైన సారెను తలసాని చేతులమీదుగా అమ్మవారికి సమర్పించారు. కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో కళకళలాడే అమ్మవారు బంగారు చీరలో మరింత శోభను సంతరించుకున్నారు.
వేడుకల్లో మంత్రులు..
మేడ్చల్ జిల్లా కీసరలో మంత్రి మల్లారెడ్డి.. విద్యార్థులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన వేడుకలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్... భారీ కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. హుజూరాబాద్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని.. ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రిలో ముఖ్యమంత్రి గోత్ర నామాలతో సుదర్శన నారసింహ హోమం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. అమీర్‌పేట్‌లోని గురుద్వార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లిలోని దర్గాలో తెరాస కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని దోమలగూడలో ఆది శ్రావణ మహా రుద్రయాగాన్ని.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు.
సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు, క్రీడోత్సవాలు నిర్వహించారు. హయత్‌నగర్ గిరిజన బాలికల గురుకులంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్... విద్యార్థినులకు దుస్తులు అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు పండుగలా తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఇవీచూడండి: చెట్టు నాటడమే కేసీఆర్‌కు మనమిచ్చే బహుమతి: సంతోష్
సీఎం జన్మదిన వేడుకల్లో హరీశ్ బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్