ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై ఏపీ సీఎం వైఎస్.జగన్ సమీక్షించారు. జగనన్న విద్యాకానుక, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పైనా చర్చించారు. విద్యాసంస్థల అభివృద్ధి కమిటీలు, అధికారులకు శిక్షణా కరదీపికను ఆవిష్కరించారు. మొదటిదశ నాడు-నేడులో పనులు పూరైన పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారికి సులువుగా అర్థమయ్యేలా పూర్తిచేసిన నాడు-నేడు పనుల పరిశీలనపై ప్రశ్నావళి పంపాలని ఆదేశించారు.
ప్రజలకు అంకితం
నాడు-నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేశామని, ఇప్పుడు పాఠశాలలను సరిగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఏప్రిల్ 30న తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అధికారులు పాఠశాలలకు వెళ్లినప్పుడు పాఠశాల సహా మరుగుదొడ్ల నిర్వహణపై తనిఖీలు చేయాలన్నారు. రెండోదశ కింద చేపట్టాల్సిన నాడు-నేడు పనులు, హాస్టళ్లలో నాడు-నేడు కింద చేపట్టనున్న పనులు, మరుగుదొడ్ల నిర్వహణపైనా సీఎం సమీక్షించారు.
విద్యాకానుకలో జాప్యం వద్దు
జగనన్న విద్యాకానుకపై సమీక్షించిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి కచ్చితంగా పిల్లలకు విద్యాకానుక అందాలని జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. విద్యాకానుక కింద అందించే డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సీబీఎస్‌ఈ విధానంపై సీఎం సమీక్షించారు. 2021–22 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్ చేయాలన్నారు. 2024-25లో రాష్ట్ర విద్యార్థులు సీబీఎస్‌ఈ టెన్త్‌బోర్డు పరీక్షలు రాయనున్నట్లు సీఎం తెలిపారు. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు.
విప్లవాత్మక చర్యలు
విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. దార్శనికతతో విద్యారంగంలో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్న జగన్.. ఇంత ఖర్చు, శ్రద్ధ ఎప్పుడూ పెట్టలేదన్నారు. అందరికీ మంచి విద్య అందాలని, పేదపిల్లలు గొప్పగా చదువుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్పెక్షన్, మానిటరింగ్‌లు పటిష్టంగా ఉండాలన్న ముఖ్యమంత్రి.. దీనికోసం ఏం చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అధికారులు కూర్చొని ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలన్నారు. ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిషన్ బలోపేతంగా పనిచేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు.. ఇంగ్లిషులో, తెలుగులో ఇస్తున్నామని.. ఇంగ్లిషులో బోధించడం, మాట్లాడడం అలవాటు చేయాలన్నారు.
ఫీడ్ బ్యాక్ తప్పనిసరి
జగనన్న గోరుముద్దలో మధ్యాహ్న భోజనం తయారీ, నాణ్యమైన ఆహారం తయారీపై చర్చించిన సీఎం.. ఎస్‌ఓపీలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకంపై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని.. సమస్యలు పునరావృతం కాకూడదని నిర్దేశించారు. భోజనం ఎక్కడ తిన్నా కూడా రుచి ఒకేలా ఉండాలన్నారు. గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ఆహార పదార్థాలను తయారుచేయడంపై ఎస్‌ఓపీని అందుబాటులోకి తీసుకుకావాలన్నారు. గోరుముద్ద, టాయిలెట్ల నిర్వహణపై ప్రతిరోజూ పాఠశాలల నుంచి ఫీడ్‌బ్యాక్ కచ్చితంగా రావాలన్నారు. ఎక్కడ ఏ సమస్యవచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దే వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి 12 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు