ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా.. కొలువులు మాత్రం రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తుపాకులు.. మర ఫిరంగులు ఎక్కుపెట్టిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ఎదురించి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. లక్ష్యాలు, సిద్ధాంతాల కోసం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ జయంతిరోజు విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థులు, నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు.
‘‘ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి తప్ప.. నిరంకుశత్వంగా వ్యవహరించరాదు. రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. శాంతియుత పోరాటాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోంది. దీనిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి. కొట్లాడి తెచ్చుకున్నదే కొలువుల కోసం. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ, కొలువులు మాత్రం రాలేదు. కొలువుల కోసమే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరాటం.. పోరాటం. పోలీసులు లాఠీఛార్జి చేసినంతమాత్రాన మా నిరసనలు ఆగుతాయనుకుంటే అది పొరపాటే’’ -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి: huzurabad election: 'ఈటల గెలిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా?'