Bhatti on assembly sessions: శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు పూర్తిగా అప్రజాస్వామికమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సభలో సభ్యులను అగౌరవపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే సభానేత, సభాపతి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ సభ్యులు వాకౌట్
సభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం మధ్యలోనే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వీరన్నతో కలిసి ఆయన మాట్లాడారు. శాసనసభలో కనీస మర్యాద పాటించకుండా తెరాస కార్యాలయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు కనీసం మైక్ ఇవ్వకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. సభా నిబంధనలు తెలియని సభాపతిని చూస్తుంటే మాకే సిగ్గుగా ఉందన్నారు. ఏకపక్షంగా సభ నడపడం సరికాదని.. నైతికంగా ఇది పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం, సభాపతికి లేఖలు రాస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు జరుగుతున్న తీరు పూర్తి నిబంధనలకు విరుద్ధం. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి అనుమతించకపోవడం చాలా దారుణం. కనీసం మావైపు కన్నెత్తి చూడకపోవడం సభ మర్యాద ఇంతేనా? మీ ఇష్టం వచ్చినట్లు సభ నడపటం సరికాదు. సభలో ఉన్న సభ్యుల హక్కుల కాలరాస్తే ఊరుకోం. సభ సంప్రదాయం ఇది. మేం కూడా సభను నడిపాం. కనీసం మమ్మల్ని అడగకుండా ఏకపక్షంగా జరగడం మంచిది కాదు. దీనిపై ముఖ్యమంత్రికి, సభాపతికి లేఖ రాయబోతున్నాం. సభా నిబంధనలు తెలియని సభాపతిని చూసి మేం సిగ్గు పడుతున్నాం. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. కనీస మర్యాద ఉండాలా కదా? సభా నాయకుడు, సభా వ్యవహారాల మంత్రి, సభాపతి దీనికి బాధ్యత వహించాలి. ఇదేనా మీ విధానమైతే సమావేశాలు టీఆర్ఎస్ ఆఫీసులో పెట్టుకోండి. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఉన్నది కాంగ్రెస్ గొంతు ఒక్కటే: జగ్గారెడ్డి
రాష్ట్ర శాసనసభలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపొవడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ తన కుర్చీలో విగ్రహంలా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సభాపతి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన మాట్లాడే తమ గొంతు కేసీఆర్ నొక్కుతున్నారని... ఇది ఏనాటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు. రాష్ట్రంలో గుండా, రౌడీ పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రశ్నించేందుకు ఉన్నది కాంగ్రెస్ గొంతు ఒక్కటేనని.. ప్రజలు దీన్ని గమనించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
మా గొంతు నొక్కే ప్రయత్నం: శ్రీధర్ బాబు
శాసనసభలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా పట్టించుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలలు గడిచినా సభను ఎందుకు ప్రోరోగ్ చేయలేదని ప్రశ్నించారు. శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత సభను ప్రోరోగ్ చేయడానికి 2 నుంచి 4 రోజులు పడుతుందని శ్రీధర్ బాబు తెలిపారు.
రాజ్యాంగాన్ని అవమానపరిచారు: రాజగోపాల్ రెడ్డి
సీఎల్పీ నాయకుడిగా దళితుడు ఉంటే సీఎం కేసీఆర్ ఓర్చుకోలేడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సభాపతి రాజ్యాంగాన్ని అవమానపరిచారని అయన ఆరోపించారు. రాష్ట్రంలో నియంత, నిరంకుశపాలన నడుస్తోందని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తామంటే ఎవరైనా నమ్ముతారా అంటూ రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెరాస కార్యాలయంగా అసెంబ్లీ: సీతక్క
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాన్ని కోల్పోయామని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీని తెరాస కార్యాలయంగా మార్చడం దురదృష్టకరమన్నారు. మేము ప్రశ్నిస్తామనే భయంతో మిత్రపక్షాన్ని ప్రతిపక్షంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. భాజపా, తెరాసల మధ్య రాజకీయ నాటకం నడుస్తోందని సీతక్క ఆరోపించారు.
ప్రతిపక్షమంటే గౌరవం లేదు: పొదెం వీరయ్య
కేసీఆర్ మాదిరిగా గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహారించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తామెంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి గౌరవం లేకుండా పోయిందని వీరయ్య దుయ్యబట్టారు.