పోడు భూముల (Podu Lands) సమస్యలు పరిష్కరించాలని గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోడు భూముల చట్టాన్ని తెరాస సర్కార్ అమలు చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల నుంచి పట్టాలు ఇచ్చిన భూములను లాక్కొని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అడవిని నమ్ముకున్న గిరిజనులకు ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. పోడు భూములు చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వం చూపిస్తోంది. పంటలు వేసే సమయంలో ఫారెస్ట్ అధికారులు... గిరిజనులపై దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ శాసనపక్షం ఈ విషయంపై వాయిదా తీర్మానం ఇస్తే అవకాశం ఇవ్వలేదు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా.. మైక్ ఇవ్వకుండా... గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడుతారు.
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హరితహారం పేరుతో ఇబ్బందులు
హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటి... గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఎకరానికి పట్టాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన వాటిని గుంజుకుంటున్నారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు.
-పొదేం వీరయ్య, ఎమ్మెల్యే
కేంద్రంపై నెట్టేసి..
కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం మీద నెట్టారు. పోడు భూములపై అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు ఆందోళనలు జరుగుతున్నాయి. పోడు భూముల అంశంపై చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్లయినా ఇవ్వలేదు. రాష్ట్ర పరిధిలో దానిని పరిష్కరించే అవకాశం ఉంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే తెరాస నాయకులను అడ్డుకుంటాం
-సీతక్క, ములుగు ఎమ్మెల్యే
దాగుడుమూతలేలా?
అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్నీ ప్రభుత్వం తిరస్కరించింది. 2008 వరకు 2లక్షల దరఖాస్తులు ఉంటే... కేవలం 90వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. పోడు భూముల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. భాజపా, తెరాస న్యాయం చేయకుండా దాగుడుమూతలు ఆడుతున్నాయి. ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో మీడియాకు కేటాయించిన స్థలంలోనే స్పీకర్ అవకాశం ఇవ్వాలి.
-దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే
Podu lands: 'పోడు'పై అసెంబ్లీలో చర్చిద్దాం.. వారికి మరో అవకాశమిద్దాం: కేసీఆర్