ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులతో పాటు ఐఏఎస్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మెుక్కలు నాటి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో...
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది, రైస్ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 66వ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వేల మొక్కలు నాటడమే కాకుండా పూర్తి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్ ఆవరణలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు మొక్కలు నాటారు.
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో...
ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ 50 వేలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఉప్పల్ మెట్రో రైలు డిపోలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు కారిడార్లలోని మెట్రో స్టేషన్ల కింద, ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలు... గొల్లూరు, తుర్కయాంజాల్లోని అటవీ ప్రాంతంలోను హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సాయంత్రం వరకు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తవుతుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు