తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు , అమ్మకాలకు సంబంధించి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నెల్లూరు చింతారెడ్డి పాలెంలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. నారాయణ నివాసానికి గేటు వేసి లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా సోదాలు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈనెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈనెల 23న విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి