CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదని.. ప్రజారాజధాని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిపై ఏపీ సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో పాల్గొన్న బాబు.. ఎన్నికల ముందు ఏం చెప్పారో జగన్ గుర్తు తెచ్చుకోవాలన్నారు. మడమ తిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. అమరావతిపై కుల ముద్ర వేస్తున్నారని.. మహోద్యమ సభ వేదికపై ఉన్న అందరిదీ ఏ కులమో చెప్పాలన్నారు. జగన్.. ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని హెచ్చరించారు.
"అమరావతి ఉద్యమంలో 180 మంది చనిపోయారు. అమరావతి ఉద్యమకారులు 2,500 మందిపై కేసు పెట్టారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టిన ప్రభుత్వం ఇది. అమరావతి రైతులు చేసిన పాపం ఏమిటి ? హైదరాబాద్ అనుభవం ఉందని చెప్పి భూమి తీసుకున్నాం. అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు. అమరావతి గట్టి నేల కాదని ప్రచారం చేశారు. మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా..? ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది." -చంద్రబాబు, తెదేపా అధినేత
రాజధాని నిర్మాణానికి నిధులు లేవని జగన్ అంటున్నారని.., అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని చంద్రబాబు అన్నారు. అమరావతిపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని.., దాన్ని కాపాడుకునే బాధ్యత 5 కోట్ల ప్రజలదేనన్నారు. అమరావతి రైతుల త్యాగానికి పాదాభివందనాలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఇదీ చూడండి: Massmutual india in hyderabad: ద్వితీయశ్రేణి నగరాల్లోనూ సంస్థలు స్థాపించాలి: కేటీఆర్