అమెరికా, లండన్ వంటి దేశాల తరహాలో భారత్‌లో కూడా పౌల్ట్రీ రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకుల మద్ధతు అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్-ఐఈసీ ఛైర్మన్, శ్రీనివాస ఫామ్స్ అధినేత సురేష్ చిట్టూరి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా, జపాన్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలతో పోల్చుకుంటే.. భారతదేశంలో పౌల్ట్రీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రపంచ గుడ్డు దినోత్సవం" పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ ఎగ్ కమిషన్ ఛైర్మన్ సురేష్ చిట్టూరి అధ్యక్షతన అంతర్జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెనడా నుంచి ఆ సంస్థ సీఈఓ టీమ్ లంబర్ట్ పాల్గొన్నారు. దేశంలో పలు రాష్ట్రాల నుంచి ప్రముఖ ఆరోగ్య నిపుణులు, ఇతర పౌల్ట్రీ రంగ పెద్దలు, నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తులు ఈ వెబినార్‌కు హాజరయ్యారు.
కొవిడ్-19 నేపథ్యంలో కోడి గుడ్డు వినియోగం అధికంగా ఉన్న దేశాల్లో మరింత వాడకం పెరిగిందన్నారు. జపాన్‌లో రోజుకు రెండు గుడ్లు, చైనాలో ఈ ఏడాదికి సగటున 500 గుడ్లు పెరగడం శుభపరిణామం అని సురేష్ అభిప్రాయపడ్డారు. రోజూ మనం తినే ఆహారంలో గుడ్డు చేర్చుకున్నట్లైతే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తాను కూడా కరోనా సమయంలో రైస్, పప్పులు తగ్గించుకుని గుడ్ల వినియోగం పెంచడం వల్ల 25 నుంచి 30 కిలోల బరువు తగ్గానన్నారు. తన మిత్రులు కూడా ఇదే పాటించి చక్కటి సత్ఫలితాలు సాధించారని ఆయన స్పష్టం చేశారు. ఆరు మాసాల శిశువు నుంచి అన్ని వయస్సుల వ్యక్తులు గుడ్డు తీసుకోవచ్చని ఆయన సూచించారు.
నమ్మశక్యం కానీ బహుళ పోషకాల గడ్డుని తీసుకోవడం వల్ల మెదడు, కళ్లు, గుండె, కండరాలు, రక్తం, పొట్ట, ఎముకల పనితీరు బాగుంటుందని ప్రముఖ డాక్టర్ రాఘవ్ సునిల్ తెలిపారు. ప్రత్యేకించి పచ్చ సొన తినవద్దనే ఒక అపోహ ఉందని.. అది నిరభ్యంతరంగా తినవచ్చన్నారు. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని.. అది కూడా ఎవరైనా తినొచ్చని ఆయన భరోసా ఇచ్చారు.
హై ప్రొటీన్ విలువలు గల గుడ్డు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుతుందని ఇండియన్ పౌల్ట్రీ రివ్యూ పబ్లికేషన్ కార్యనిర్వాహక సంపాదకులు సంజయ్ ముఖర్జీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : గుడ్డు వినియోగంపై మరింత అవగాహన కల్పించాలి: సురేశ్ చిట్టూరి