బాలల దినోత్సవం(Children's day celebrations in telangana)కన్నులపండువగా సాగింది. విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా.. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిల్డ్రన్స్ హోంలలోని పిల్లలు ఆహ్లాదంగా గడిపారు. 518 మంది బాలబాలికలను రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విజ్ఞాన విహార యాత్రలకు కూడా తీసుకెళ్లారు. రవీంద్రభారతిలో చిన్నారులు ప్రదర్శించిన నాటకాలు విశేషంగా అలరించాయి. సినీ, జానపద పాటలకు చేసిన నృత్యాలు కనువిందు చేశాయి.
పిల్లల హక్కుల కోసం చర్యలు
పిల్లల హక్కులు కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(Satyavathi Rathod) అన్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వెల్లడించారు. అనాథ పిల్లలను ప్రభుత్వం సొంత పిల్లల్ల చూసుకుంటోందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) తెలిపారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాలల రక్షణ, భద్రత, వారి భవిష్యత్తుకు సంబంధించి సంరక్షణ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ కృషితో వారి చట్టాలను సమర్థవంతంగా అమలుచేస్తున్నాం. -
సత్యవతి రాఠోడ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి
చిన్నారులకు ఆర్టీసీ చిరు కానుక..
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని అధికారిక నివాసంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indrareddy) చిన్నారులతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. సర్కారు బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు చిన్నారులకు టీఎస్ఆర్టీసీలో(TSRTC) ఉచిత ప్రయాణ వసతి కల్పించింది. ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరంలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్(MD Sajjanar) ప్రకటించారు. చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని రియల్ పేజ్ ఇండియా సంస్థ 30 వేల జతల షూస్‌ను విరాళంగా అందించింది. ఇప్పటికే ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
పిల్లల్లో మరింత అవగాహన పెరగాలి: శేఖర్ కమ్ముల
లైంగిక వేధింపుల విషయంలో పిల్లల్లో మరింత అవగాహన పెరగాలని దర్శకుడు శేఖర్ కమ్ముల(Director Sekhar kammula) అభిప్రాయపడ్డారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని... లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. సికింద్రాబాద్ రసూల్‌పురాలో హుమానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి గేయాలకు చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో అలరించాయి.
లవ్ స్టోరీ సినిమా చేసేందుకు ఇన్స్పైర్ అయి చిన్న పిల్లలను చూసేందుకు చాలా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాను. ఎంతో మంది పిల్లలు చెప్పలేక పోయిన వారందరి కోసమే లవ్ స్టోరీ సినిమా. అమ్మాయిలకే కాదు అబ్బాయిలు ఎక్కువ ఈ సమస్యలకు గురవుతుంటారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారికి ఆర్థిక స్తోమత ఉండదు. చాలా మంది ఇతరులపై ఆధారపడి ఉంటారు. కొందరు ఎవరైనా వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.- శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు
ఇదీ చూడండి: