Energy efficient world paintings: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా విద్యార్థుల ద్వారా సమాజంలో ప్రేరణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేసింది. ఈ మేరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) నేతృత్వంలో సికింద్రాబాద్ కవాడిగూడలోని ఎన్టీపీసీ కార్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు మినహా మిగతా జిల్లాల నుంచి ఔత్సాహికులైన విద్యార్థినీవిద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పోటీలో పాల్గొన్నారు. ‘ఎనర్జీ ఎఫిషీయన్సీ ఇండియా’ ప్రధానాంశంగా పోటీలు జరుగుతున్నాయి.
energy efficient india: శక్తి, విద్యుత్తు ఆదా (ఎనర్జీ కన్సర్వేషన్), ఎనర్జీ ఎఫీషియంట్ ఇండియా, మొక్కల సంరక్షణ తదితర అంశాలను ప్రతిబింబించేలా విద్యార్థులు చిత్రాలు గీయాల్సి ఉంటుంది. అందులో భాగంగా విద్యార్థులు తమ పెయింటింగ్‌లతో వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆ చిత్రాలు వారిలోని సృజనాత్మకతనే కాకుండా విద్యుత్, శక్తి పొదుపుపై తమ ఆలోచనను ప్రతిబింబించాయి. పాఠశాల విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ (ఎ) లో - 5, 6, 7 తరగతులు, గ్రూప్ (బి) లో - 8, 9, 10 తరగతులకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
painting competition by ntpc: ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి 13 మంది విజేతలకు ఈ నెల రెండో వారంలో బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం విజేతలు గీసిన చిత్రాలను జాతీయ అవార్డులకు నామినేట్ చేసేందుకు పరిశీలన కోసం దిల్లీకి పంపిస్తారు. ఈ చిత్ర లేఖన పోటీ చివరి దశ.. నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో డిసెంబరు 6న జరగనున్నాయి. ఈ పోటీలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి ఔత్సాహికులైన విద్యార్థినీ విద్యార్థులు సైతం పాల్గొనవచ్చు. ఈ రోజు జరిగిన పోటీలో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు ఎల్ఈడీ బల్బులు, ధ్రువపత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి: Rosaiah political career: యాభై ఏళ్లకుపైగా రాజకీయ ప్రస్థానం.. రోశయ్య సేవలు అద్వితీయం..