పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. పీవీకి భారతరత్న ఇచ్చి దేశం తనను తాను గౌరవించుకోవాలని అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పీవీకి భారతరత్న ప్రకటించాలని సూచించారు. పార్లమెంటు ప్రాంగణంలో పీవీ విగ్రహం నిర్మించాలని డిమాండ్ చేశారు. పీవీ మన ఠీవి అని కొనియాడారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలను ప్రజలంతా స్మరించుకునేలా చేస్తామని చెప్పారు.
ప్రధాని పదవి చేపట్టిన మొదటి దక్షిణాది వ్యక్తి.. పీవీ అని గుర్తు చేశారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండోవ్యక్తి అని కొనియాడారు. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశం కష్టాల్లో ఉందని... దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘనత పీవీదేనని అన్నారు. దేశ ఆర్థిక రథాన్ని పీవీ ప్రగతి పథంలో పరుగులు పెట్టించారని తెలిపారు. పీవీ నాటిన సంస్కరణల బీజాల ఫలితాలే మనం అనుభవిస్తున్నామని వివరించారు. గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. పీవీ అని ఉద్ఘాటించారు.
సరిహద్దుల్లో సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్న ఘనత పీవీదేనని అన్నారు. 1972లో రాష్ట్రంలో భూసంస్కరణలు అమలుచేసిన ఘనత ఆయనదేనని మరోసారి కొనియాడారు. సొంతభూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని గుర్తు చేశారు.
గురుకుల పాఠశాలలు, నవోదయ విద్యాలయాలను పీవీ ప్రారంభించారని కేసీఆర్ అన్నారు. తెలుగు అకాడమీ నెలకొల్పిన ఘనత పీవీదేనని స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు పలు భాషలు తెలిసిన పండితుడని పేర్కొన్నారు. విశ్వనాథ వేయిపడగలు నవలను సహస్ర్ ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారన్నారు. సినారె, విశ్వనాథ, కాళోజీకి పురస్కారాలు వచ్చేందుకు పీవీ కృషి చేశారని చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో పీవీ తైలవర్ణ చిత్రం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.