తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రభుత్వ విధానం అమలుకు ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నియంత్రిత సాగుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నియంత్రిత సాగుపై జిల్లాలవారీగా జరుగుతున్న సదస్సులపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోంది. సాగును సుసంపన్నం చేసేందుకు సమగ్ర వ్యూహంతో ముందుకెళుతోంది. ప్రభుత్వాన్ని రైతులు అన్ని విధాల విశ్వసిస్తున్నారు. సాగునీటి వసతి, పెట్టుబడులు, ఎరువులు, విత్తనాలు, పంటలకు అనువైన నేలలు అందుబాటులో ఉన్నాయి. అందుకే కొత్త విధానంపై ముందుకెళ్తున్నాం. దీనికి రైతులంతా సహకరించాలి. రోహిణి కార్తె నాటికి జిల్లాల్లో అవగాహన సదస్సులు పూర్తిచేయాలి. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ యంత్రాంగం రైతుల్లో చైతన్యం తేవాలి. వానాకాలం సీజన్ నాటికి రైతులను సన్నద్ధం చేయాలి’’ అన్నారు.
జిల్లాల పర్యటనపై చర్చ
నియంత్రిత సాగుకు శ్రీకారం చుట్టే కార్యక్రమ నిర్వహణపై సీఎం చర్చించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు ఆరంభించడం ఆనవాయితీ కాగా ఆ జిల్లాలో పర్యటించే అంశంపై వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌లతో మాట్లాడారు. సభలు నిర్వహించే అవకాశం లేనందున సాగుబడిని పరిమిత రైతులతో ప్రారంభించాలనే అభిప్రాయం వ్యక్తమయింది. త్వరలోనే దీనిని ఖరారు చేస్తారు.
సత్వరమే రైతువేదికల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా 2602 క్లస్టర్లలో నిర్మించనున్న రైతు వేదికల నమూనాలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇందులో ఒక హాలు, రెండు గదులుంటాయి. ఒక గది వ్యవసాయాధికారికి, మరోటి భూసార పరీక్షల కేంద్రంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వీటిని టెండర్ల ద్వారా నిర్మిస్తారు. ఇప్పటికే సీఎం ఎర్రవెల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో వేదిక నిర్మిస్తామని ప్రకటించారు. దాని నిర్మాణం మొదట చేపడతారు.
ఇదీ చూడండి: విమానాలను ధ్వంసం చేసే లేజర్ అమెరికా సొంతం!