Komatireddy Venkatreddy Vs Cheruku Sudarakar: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను బెదిరిస్తూ ఆయన కుమారుడు సుహాస్‌తో మాట్లాడిన మాటలు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలేనని.. తనకు వేరే ఉద్దేశం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఫోన్లో మాట్లాడిన ఆడియోను.. ముందు మాట్లాడిన విషయాన్ని ఎడిట్ చేసి లీక్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి సుధాకర్ తనను తిడుతున్నారని చెప్పారు. తిట్టొద్దని మాత్రమే సుధాకర్ కుమారుడికి చెప్పినట్లు వివరించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సుధాకర్ అనడంతో.. బాధతో మాట్లాడానని వివరణ ఇచ్చారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంపేస్తానని చేసిన వ్యాఖ్యలపై.. చెరుకు సుధాకర్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు ఫిర్యాదు పత్రం అందజేశారు. చెరుకు సుధాకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, గోమాత శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు ఎలాంటి వైరం లేదన్న చెరుకు సుధాకర్.. ఆయన వ్యాఖ్యలు క్రిమినల్‌ను తలపించేట్లు ఉన్నాయని ఆరోపించారు.
Controversies Started Again In Telangana Congress: చెరుకు సుధాకర్‌పై హత్యాయత్నం చేస్తానని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని.. జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు డిమాండ్ చేశారు. అరెస్టు చేయకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. దీనిపై అధిష్ఠానం ఇంకా స్పందించలేదు.
"నేను ఫోన్ చేసి ఎవరినీ తిట్టలేదు. భావోద్వేగాలతోనే మాట్లాడాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. నేను ముందు ఏ విషయం అయితే మాట్లాడానో ఆ విషయాన్ని వదిలేసి.. నేను దూషించాను అనే ఆడియోను ఎడిట్ చేశారు. ఈ విషయంపై ప్రజలు అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను. వెంకట్‌రెడ్డిని తిడితే టికెట్ వస్తుందని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ
"ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీకు నా నుంచి ఏ ఒక్క పదం తప్పుగా దొర్లిందో చెప్పాలి. ఆ విషయాన్ని అందరి ముందు పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. పార్లమెంటు సభ్యుడై ఉండి సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడిని ఇంత దారుణ పదజాలంతో తిడతారా. ఇదేనా సంస్కారం. క్రిమినల్ యాక్టివిటీ మాట్లాడారు. వంద కార్లలో మా వాళ్లు తిరుగుతున్నారు. ఆస్పత్రికి బాంబు పెట్టి పేల్చేస్తామని చెప్పారు." - చెరుకు సుధాకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి: