రాష్ట్రంలో సంయుక్త కలెక్టర్ల వ్యవస్థ కనుమరుగైంది. పాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని అమలు చేసింది. ఆదివారం రాత్రి చేపట్టిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులతో జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
అన్ని జిల్లాల్లో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జిల్లా సంయుక్త కలెక్టర్ పోస్టులో ఉన్న వారిని కూడా తొలగించి అదనపు కలెక్టర్ల హోదాను కేటాయించింది. జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టుల్లోనూ (డీఆర్వో) మార్పులు చేసింది. ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్లుగా, డీఆర్వోలుగా కొనసాగిన వారిని అదే స్థానంలో అదనపు కలెక్టర్లుగా నియమించింది.
జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లు
సంక్షేమ కార్యక్రమాల అమలుకు మెరుగైన వ్యవస్థ అవసరమని జిల్లా స్థాయిలో పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీరాజ్, పురపాలక చట్టాలకు పదును పెట్టింది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు కూడా మెరుగైన వ్యవస్థ అవసరమని భావిస్తోంది.
దీనిలో భాగంగానే సత్తాగల అధికారులను కలెక్టర్లకు జత చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ప్రతి జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను కేటాయించింది. ఇప్పటి వరకు జిల్లాకు ఒక కలెక్టర్, ఒక సంయుక్త కలెక్టర్‌ను నియమిస్తూ వస్తున్నారు.
ఇకపై కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు ఉంటారు. ఒకరిని స్థానిక సంస్థలకు బాధ్యులుగా పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా 11వ తేదీన జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ లోగానే పాలనపరంగా మార్పు చేర్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి : 'విజయ'కు గడ్డుకాలం... గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నం