తన ఇద్దరు అక్కలను హత్య చేసిన నిందితుడు ఇస్మాయిల్ అదే ఇంట్లో ఉరి వేసుకున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో ఘటన జరిగింది. చంద్రాయణగుట్ట పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో ఒకట్రెండు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలేమైందంటే...
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాల ప్రాంతంలో నివాసముండే అహ్మద్ బిన్ ఇస్మాయిల్.. సోమవారం తన అక్కాచెల్లెళ్లు ముగ్గురిని ఇంటికి పిలిపించుకున్నాడు. జాకెర బేగం, రజియా బేగం రాగా వారిపై కత్తితో ఇంట్లోనే దాడిచేసి పారిపోయాడు. గమనించిన స్థానికులు ప్రాణాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందింది. ఈ ఘటనలో చాంద్రాయణగుట్ట పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
అనంతరం బాలాపూర్ పీఎస్ పరిధిలోని నబీల్ కాలనీలో ఉండే తన సోదరి నూర్ ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న బావ, సోదరిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ గాయపడ్డారు. బాలాపూర్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతను తన భార్య హత్య కేసులో సైతం నిందితుడుగా ఉన్నాడని వివరించారు.
ఇదీ చూడండి:అక్కలపై ఉన్మాదం... ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం