ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం రాజకీయ రణరంగానికి వేదికైంది. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశం, రాముడి విగ్రహ శిరస్సును పడేసిన కోనేరును... తెదేపా అధినేత చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబు గుడిపైకి చేరుకునేసరికి ఆలయానికి తాళం వేసి ఉండగా... విగ్రహ ధ్వంసం ఘటనపై స్థానికులు, పూజారుల నుంచి.. బాబు వివరాలు సేకరించారు. వైకాపా సర్కార్ బాధ్యతారాహిత్య పాలనలో.. మనుషులతోపాటు దేవుడుకి కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.
పర్యటన సాగిందిలా...
రామతీర్థం వెళ్లేందుకు ముందుగా చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తెలుగుదేశం శ్రేణులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. రామతీర్థం పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్‌ని పోలీసులు అనేకచోట్ల నిలిపేయడం.... తెలుగుదేశం శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది.
విజయనగరం పట్టణంలోని 3 రోడ్ల కూడలి వద్ద తనను పోలీసులు అడ్డుకోగా....చంద్రబాబు కొద్దిసేపు రోడ్డపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత బయల్దేరిన చంద్రబాబును.... నెల్లిమర్ల-రామతీర్థం జంక్షన్ వద్ద కూడా నిలిపివేసిన పోలీసులు.... ట్రాఫిక్ సమస్య ఉందని వేరే మార్గంలో వెళ్లాల్సిందిగా సూచించారు. 15 నిమిషాల తర్వాత కాలినడకనే వెళ్తామని అశోక్‌గజపతిరాజు తెలపగా...పోలీసులు అంగీకరించారు. తర్వాత చంద్రబాబు సహా నేతలు కాలినడకనే బోడికొండకు వెళ్లారు.
మెట్లమార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి కొండపైకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ మొత్తం పరిశీలించారు. చంద్రబాబు గుడిపైకి చేరుకునే సరికి ఆలయానికి తాళం వేసి ఉంది. విగ్రహ ధ్వంసం ఘటనపై స్థానికులు, పూజారుల నుంచి చంద్రబాబు వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: జగన్ విజయనగరం వచ్చినా.. రామతీర్థంపై ఎందుకు మాట్లాడలేదు?