NTR DEATH ANNIVERSARY : ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లో ముందుకెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని యువతను ఎన్టీఆర్ ప్రోత్సహించారన్న బాబు.. యనమల వంటి యువకులకు అవకాశాలిచ్చారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
సింగిల్ విండో విధానంతో ఎన్టీఆర్ వ్యవసాయాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్ పాలనతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని విమర్శించారు. అమ్మఒడి అని చెప్పి పాఠశాలలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తమ పాలనకు ఎన్టీఆర్ సృష్టికర్త అని కొనియాడారు. ఉత్తమ విధ్వంసకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్న బాబు.. నేడు భావితరాల భవిష్యత్తు గోదావరి పాలైందని ధ్వజమెత్తారు. సైకో సీఎం చేతిలో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమం లేదు... సంక్షోభంలో రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.
రోడ్డుపైనే దేవినేని రక్తదానం: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి టీడీపీ కార్యాలయానికి అధికారులు తాళాలు వేయటంతో మాజీ మంత్రి దేవినేని ఉమ, పార్టీ కార్యకర్తలు రోడ్డుపైనే పడుకుని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ 27 వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును రోడ్డుపైనే నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి దేవినేని ఉమ, కేశినేని చిన్ని, పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, అధికారులకు బుద్ధి రావాలి అనే ఉద్దేశంతో రోడ్డుపై పడుకొని రక్తదానం చేసినట్లు దేవినేని ఉమ దుయ్యబట్టారు.
బ్లడ్ డొనేషన్ నిమిత్తం బెడ్లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరు అందరికీ తెలియాలనే నేల మీద పడుకుని రక్తదానం చేసినట్లు తెలిపారు. సీఎం కళ్లల్లో ఆనందం చూసేందుకే పోలీసులు పని చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని పార్టీలన్నింటికీ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా అని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ అడుగులో అడుగేస్తారని.. జగన్ ఎన్ని తప్పుడు ఆర్డర్లు ఇచ్చినా యువగళం ఆగదని తేల్చి చెప్పారు.
పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల వద్ద ఆయన విగ్రహానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదవాడి సంక్షేమం కోసం రామారావు ఎనలేని కృషి చేశారని కేశినేని నాని అన్నారు. పేద ప్రజలను కేవలం ఓటు బ్యాంకు గానే చూసే సమయంలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీను స్థాపించారన్నారు. ఎన్టీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం ఒక సంచలనమన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు.
ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం: ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ.. పార్టీ కోసం శ్రమిస్తున్నామని టీడీపీ నేత కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని ధ్వజమెత్తారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందించారు. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారికి సహకరిస్తానని తెలిపారు. కేశినేని నానికి టిక్కెట్ ఇచ్చినా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పనిచేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో నానితో విభేదాల కారణంగా పనిచేయలేదని స్పష్టం చేశారు. విభేదాలు ఉన్నా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను పట్టించుకోనన్న చిన్ని.. ఆవేశంలో మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: