CBN FIRES ON CM JAGAN: బాబాయిని చంపిన వాడు నేడు రాష్ట్రాన్ని పాలించటం.. ఇదేం ఖర్మ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపినంత సులువుగా తననూ చంపొచ్చని జగన్ అనుకుంటున్నారని.. ఇప్పుడు లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. బహిరంగ సభకు జనం భారీగా పోటెత్తారు. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్‌కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నది ప్రజల డిమాండ్ అని తెలిపారు. వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి ఉండదని అన్నారు. వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావటం.. జగన్ రెడ్డికి గట్టి చెంపదెబ్బ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సునీత చేసిన పోరాటాన్ని అభినందించాలి: తండ్రి హత్య కేసుపై సుప్రీంకోర్టు వరకూ సునీత చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని వైఎస్ సునీత పోరాడుతోందని తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.. ఆపై బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ గెలిస్తే పోలవరాన్ని ముంచేస్తారని తాను ఆనాడే చెప్పినట్లు గుర్తు చేశారు. ముద్దులు పెడితే మోసపోవద్దు.. పిడిగుద్దులు ఉంటాయని గతంలోనే చెప్పినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల్లో చైతన్యం కోసమే: ప్రజల్లో చైతన్యం కోసమే 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం చేపట్టినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారాన్ని పోలవరంగా మార్చి.. ప్రాజెక్టును పరిగెత్తించినట్లు తెలిపారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తయ్యాయని.. వైసీపీ రాగానే ప్రాజెక్టు రివర్స్ టెండర్ చేపట్టారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
పోలవరం పూర్తయితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని చంద్రబాబు తెలిపారు.రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.7 లక్షల తలసరి అప్పు ఉందని.. మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లుగా అమాయకులను అరెస్టు చేస్తున్నారన్న బాబు.. జగన్‌కి పోలీసులు ఉంటే తనకు ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
"పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఇప్పుడున్న మంత్రికి డయాఫ్రం వాల్ అంటే ఏంటో కూడా తెలీదు. ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నారు. నా బాధంతా రాష్ట్రం కోసమే. నెలకొక్కసారి పోలవరం వచ్చేవాడిని. సోమవారం పోలవరంగా మార్చాను. సమీక్షలు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించా. గేట్లు పెట్టేంతవరకు పనులు పూర్తి చేయించాను. సీఎంగా ప్రమాణం చేసిన రోజునే రివర్స్ టెండర్ అని తీసుకొచ్చి పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డబ్బుల కోసం కాంట్రాక్టర్లను మార్చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేది." - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: 'నాడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం.. నేడు తెలంగాణ ఆడబిడ్డనంటూ నినాదం'
'గుజరాత్లో ఈసారీ అధికారం మాదే.. ఆమ్ ఆద్మీకి 'గుండు సున్నా''