CBN Meeting with bc leaders: బీసీల పొట్టగొట్టిన జగన్‌రెడ్డి తన పొట్ట నింపుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు ఇదేం ఖర్మ అని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేరుకు మాత్రమే బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనం అంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు.
జగన్ మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని మండిపడ్డారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప బీసీలకు అదనంగా జగన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 140 బీసీ కులాలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా ముగ్గురికే ఇచ్చారని విమర్శించారు.
విశ్వవిద్యాలయ వీసీలు, ప్రభుత్వ సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువ ఉన్నారో చర్చించేందుకు జగన్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు. బీసీలను వెతుక్కుంటూ వచ్చి వారికి పదవులు ఇచ్చే బాధ్యత తనదని స్పష్టంచేశారు. 54 బీసీ సాధికారి కమిటీలు ఊరూరు తిరిగి మీకేం కావాలో నివేదిక తయారు చేయాలని వాటిని అమలు చేసి బీసీల రుణం తీర్చుకునే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
"మాయ మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచేశాడు. కావాలని కులాల మధ్య చిచ్చు పెట్టడం, మభ్య పెట్టడం, అసత్య ప్రచారం చేయడం వల్ల రాజకీయ లబ్ధిపొంది బీసీలను అణగదొక్కారు. ఒక్క దెబ్బతో బీసీలందరినీ 24 శాతం స్థానిక సమస్యల రిజర్వేషన్లు తగ్గించారు. ఈ ఒక్క నిర్ణయంతో 16800 పదవులు కోల్పోయే పరిస్థితికొచ్చారు. 12 యూనివర్సిటీల్లో 10యూనివర్సిటీల్లు అగ్రవర్ణాలకే ఇచ్చారు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగు దేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత..
ఇవీ చదవండి: