CEO Vikas Raj on Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో పాటు కేంద్ర బలగాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నిక సాఫీగా, సజావుగా జరగడంతో పాటు ఓటర్లలో విశ్వాసం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రెండు జిల్లాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
30 శాతం, 50 శాతం అమ్మకాలు పెరిగిన మద్యం దుకాణాలపై పర్యవేక్షణ కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన.. అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 100 నిమిషాల్లోపు వాటిని ఈసీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. తర్వాత విచారణ జరిగి తగిన చర్యలు తీసుకుంటుందని సీఈవో వివరించారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినపై చర్యలు తప్పవు: పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించేలా చూడాలని వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటి వాటికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలు, అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని.. ఎలాంటి అక్రమాలకు పాల్పడరాదని సూచించారు.
ఇప్పటి వరకు 21 ఎఫ్ఐఆర్లు: ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు.. రూ.2.95 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ మరో 123 కేసులను నమోదు చేసి.. 55 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు లేని అధికారంతో గుర్తు మార్చిన మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. తక్షణమే సస్పెండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటల్లోగా ఉత్తర్వులు పంపాలని ఈసీ ఆదేశించింది. అటు ఆ రోజు రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించనందుకు స్థానిక డీఎస్పీని బాధ్యుణ్ని చేయాలని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం.. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ ఎంచుకున్న 739 మంది దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పటి వరకు 624 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. రేపు కూడా బృందాలు వారి ఇళ్ల వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కును నమోదు చేయనున్నాయి.
ఇవీ చదవండి: Munugode bypoll: దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్లు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెరాస నేతలకు కేటీఆర్ కీలక సూచన