రాబోయే రోజుల్లో అటవీశాఖలో 33 శాతం మహిళలు పని చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆకాంక్షించారు. అటవీశాఖలో మహిళలు రాణించడం శుభపరిణామమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళా ఐఎఫ్ఎస్ అధికారుల వివరాలతో కూడిన.. గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా-నేషన్స్ ప్రైడ్ అనే పుస్తకాన్ని వర్చువల్గా దిల్లీ నుంచి ఆయన ఆవిష్కరించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 284 మంది మహిళలు ఐఎఫ్ఎస్ అధికారులుగా వివిధ హోదాల్లో రాణిస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అటవీ సంరక్షణ ప్రధానాధికారులుగా కూడా పీసీసీఎఫ్లే ఉన్నారన్నారు. తెలంగాణ అటవీ శాఖలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని పీసీసీఎఫ్ ఆర్.శోభ మంత్రికి వివరించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి రాష్ట్ర అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.