మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానానికి చేరుకుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ఆయనతో పాటు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, కార్పొరేటర్ రచనశ్రీ సందర్శించారు.
రాష్ట్రాలు విఫలం
కరోనాకే కాకుండా డెల్టా వేరియంట్ వ్యాధికి కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డెల్టా ప్లస్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహల పట్ల ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. దేశంలో వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే అవసరం రాకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేసే స్థితిలో ఉన్నామని వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారం ఇచ్చినా టీకాలను ప్రజలకు అందించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
కరోనా రెండు, మూడు దశల విస్తరణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్ష్మణ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్‌ను అన్ని వర్గాల ప్రజలకు అందించకపోవడానికి గల కారణాలను అన్వేషించకుండా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ts high court:మరియమ్మ లాకప్ డెత్‌పై విచారణ ఆగస్టు 2కి వాయిదా