Kishan reddy Letter: రాష్ట్రంలో 1300 కిలోమీటర్లకు పైగా రైల్వే పనుల్లో ఆలస్యమవుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడం, భూమిని సేకరించి ఇవ్వడంలో జాప్యం ప్రభావం చూపుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు రైల్వేను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. రైల్వేల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని.. కొత్త లైన్లు, డబ్లింగ్, అవసరమైనచోట మూడో లైన్, విద్యుదీకరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు.
2014-2020 కేంద్ర బడ్జెట్ కేటాయింపుల సగటుతో పోలిస్తే 2022-23లో తెలంగాణకు రైల్వే కేటాయింపులు 3రెట్లు పెరిగాయని వివరించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ 1,300 కి.మీ. ప్రాజెక్టుల వివరాల్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. కాజీపేట-విజయవాడ, కాజీపేట-బల్లార్ష, మణుగూరు-రామగుండం, మనోహరాబాద్-కొత్తపల్లి, కృష్ణ-వికారాబాద్, బోధన్-లాతూర్, కొండపల్లి-కొత్తగూడెం, మునీరాబాద్-మహబూబ్‌నగర్, కరీంనగర్-హసన్‌పర్తి, భద్రాచలం రోడ్-సత్తుపల్లి, అక్కన్నపేట-మెదక్, కాజీపేట-హసన్‌పర్తి రోడ్ ప్రాజెక్టులను ఆ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయాలని, భూసేకరణ సత్వరం పూర్తి చేయాలని, భూవివాదాలున్న చోట పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
ఇదీ చదవండి: