హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పన్నుల ఎగవేతకు పాల్పడిన సంస్థలపై కేంద్ర జీఎస్టీ విభాగం మరోసారి దాడులు చేసింది. సోమవారం ఉదయం మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. 15 సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన 23 సీజీఎస్టీ ప్రత్యేక బృందాలు పలు పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
60 లక్షల పన్ను చెల్లించిన సినీ ప్రొడక్షన్:
ప్రాథమిక అంచనాల మేరకు 12కోట్ల మేర సెంట్రల్ ఎక్సైజ్, సేవా, జీఎస్టీలకు చెందిన పన్ను పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. హైదరాబాద్‌లోని ఓ సినీ ప్రొడక్షన్ కార్యాలయంపై సోదాలు చేయగా 60 లక్షల వరకు జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు గుర్తించడం వల్ల తక్షణమే ఆ మొత్తాన్ని యాజమాన్యం చెల్లించింది. ఓ కూల్‌డ్రింక్ తయారీ కంపెనీలో తనిఖీలు చేయగా 5 కోట్లకు పైగా సెంట్రల్ ఎక్సైజ్ పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పైపుల తయారీ సంస్థలపై దాదాపు రెండు కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్, విశాఖపట్నంలలోని రెండు ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ కేంద్రాలు నాలుగున్నర కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇవీ చూడండి: బకాయిలే లక్ష్యంగా.. జీఎస్టీ నిఘా విభాగం సోదాలు