ఏపీలోని పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలేస్తోంది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఇప్పటికే కోతపెట్టిందని ఆందోళన చెందుతుంటే ఇప్పుడు మరింత తగ్గించే నిర్ణయం ఒకటి తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టులో తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి, విద్యుత్కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. ఆ మేరకు కోత పెట్టి 2014 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ధరల ప్రకారం అంచనాలు లెక్కించి ఆ మొత్తమే ఇస్తామని తేల్చింది.
ఒకవేళ ఇప్పటికే తాగునీటి సరఫరా, విద్యుత్కేంద్రం పనులకు నిధులిచ్చి ఉంటే ఇకపై చెల్లించబోయే బిల్లుల నుంచి ఆ మొత్తాలను మినహాయించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారి అనూప్ శ్రీవాత్సవ తాజాగా ఒక లేఖ పంపినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ వర్గాలు ఈ విషయాలు వెల్లడించాయి.
షరతులతో ఆందోళన
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన సొమ్మును కేంద్రం తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రూ.2 వేల 234 కోట్లు బకాయిలుండగా.. సంబంధిత దస్త్రం అన్నిస్థాయిల్లో తనిఖీ పూర్తై కేంద్ర ఆర్థికశాఖకు చేరింది. ఐతే ఆర్థికశాఖ కొన్ని షరతులు విధించడం ఆందోళన రేకెత్తిస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ నాటి ధరలు, క్వాంటిటీల ప్రకారం 20 వేల 398.61 కోట్లకు డీపీఆర్-2 ఖరారు చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2017 మార్చి నాటి కేంద్ర మంత్రిమండలి నోట్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఆ లెక్కలే ఆమోదించి పంపాలని పోలవరం అథారిటీకి సూచించింది.
ఇక పోలవరం ప్రాజెక్టుకు కేవలం 7వేల 53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. తాజాగా జలశక్తి శాఖ రాసిన లేఖ ప్రకారం ఆ మొత్తం వచ్చే అవకాశం లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు 4 వేల 730 కోట్లు వెచ్చించగా ఆ నిధులను ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేసింది.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఏపీకి రూ.8 వేల 614 కోట్లను కేంద్రం చెల్లించింది. ఆ నిధులను ఏయే విభాగాల కింద చెల్లించారో పోలవరం అథారిటీ ఇప్పుడు మళ్లీ పరిశీలించాలి. అందులో ఒకవేళ తాగునీటి విభాగం, విద్యుత్కేంద్రం పనుల కింద చెల్లింపులు జరిగాయని గుర్తిస్తే అలా చెల్లించిన మొత్తాన్ని ఇకపై కేంద్రం ఇచ్చే బిల్లుల్లో మినహాయించుకోనుంది.
ఇదీ చదవండి : సాగుకు ఘాటు... సామాన్యుడికి పోటు!