Coach Factory: తెలంగాణకు మొండిచేయి... మహారాష్ట్రకు నిధులు - లాతోర్‌లో కోచ్ ఫ్యాక్టరీ
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపించి... మహారాష్ట్రలోని లాతూర్‌లో మాత్రం ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తోంది. రూ.625 కోట్లు కేటాయించి... ఇప్పటికే రూ. 587 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వ్యాగన్ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఉత్పత్తే సరిపోతుందని, కొత్త వాటి అవసరం లేదని చెప్పి.. మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని, దేశీయ అవసరాలకు ప్రస్తుతమున్నవే సరిపోతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని లాతూర్‌లో మాత్రం రూ.625 కోట్ల వ్యయంతో ఒకదాన్ని ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తోంది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పక్కనపెట్టింది. 2018లో రైల్వే బోర్డు మంజూరు చేసిన లాతూర్ కోచ్ ఫ్యాక్టరీని శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. దానికి కేటాయించిన రూ.625 కోట్లలో ఇప్పటికే రూ.587 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ ఇచ్చిన సమాధానంతో వెలుగులోకి వచ్చింది.
2010 బడ్జెట్‌లోనే వ్యాగన్ ఫ్యాక్టరీపై ప్రకటన
సికింద్రాబాద్‌లో పీపీపీ విధానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. సికింద్రాబాద్‌లో తగినంత స్థలం కేటాయించడం కష్టమన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2011-12లో కాజీపేటలో 40 ఎకరాలు కేటాయించింది. కాజీపేటకు రైల్వేశాఖ వ్యాగన్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. ఆ తర్వాత ఆ పనులను ఆపేసింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వ్యాగన్ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఉత్పత్తే సరిపోతుందని, కొత్త వాటి అవసరం లేదని 2016 మార్చి 11న అప్పటి కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు నాటి రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లోని 10వ అంశం కింద తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని చేర్చారు. ఆ అంశంపై అధ్యయనానికి సీనియర్ అధికారులతో రైల్వేశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసిందని అనంతరం రైల్వేశాఖ సమాచార హక్కు చట్టం కింద ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 2018 ఏప్రిల్‌లో ప్రతిపాదించిన లాతూర్‌లో మాత్రం ఆగస్టుకల్లా మంజూరు చేసి, నవంబరుకల్లా పనులు మొదలుపెట్టారు. గత రెండు పర్యాయాలు మహారాష్ట్రకు చెందిన సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్‌లు రైల్వే మంత్రులుగా కొనసాగడం వల్లే పనులు వేగంగా పట్టాలెక్కి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: 'కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాటం చేస్తాం'