Telangana assembly elections 2023 : తెలంగాణలో త్వరలో రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఎన్నికల అధికారులకు కార్యశిబిరం నిర్వహించారు. ఈ సెమినార్లో ఈవీఎంల మొదటి దశ తనిఖీల విషయమై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌తో పాటు ఈసీఐ సీనియర్ అధికారులు... త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అండమాన్ , డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ తదితర రాష్ట్రాల ఈవీల నోడల్ అధికారులు కూడా ఈ కార్యశిబిరంలో పాల్గొన్నారు. ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి.
central election commission : ఈసీఐఎల్ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల మొదటి దశ తనిఖీ విషయమై అవగాహన కల్పించారు. అందుకు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి వివరించారు. ఎఫ్ఎల్సీ విధానం, డీఈఓలు, డిప్యూటీ డీఈఓల బాధ్యతలు, సింబల్ నమోదు విధానం, వీవీప్యాట్స్ వినియోగం గురించి వారికి కూలంకషంగా వివరించారు. జిల్లా ఎన్నికల నిర్వహణా ప్రణాళిక తయారీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఈఓలను సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశించారు.
వ్యయం పరంగా సున్నితమైన నియోజకవర్గాలు, ప్రాంతాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మానవవనరుల డేటాబేస్‌ను సిద్ధం చేయాలని చెప్పారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రతి జిల్లాలో 18 మంది నోడల్ అధికారులను నియమించాలని వికాస్ రాజ్ ఆదేశించారు. అక్టోబర్ ఒకటి అర్హతా తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చిందన్న ఆయన.. ఆగస్టు రెండో తేదీన ముసాయిదా ప్రచురించి, అక్టోబర్ నాలుగో తేదీన తుది జాబితా ప్రకటించాలని స్పష్టం చేశారు.
బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన ప్రక్రియపై దృష్టి సారించాలని డీఈఓలకు సూచించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణతో పాటు కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ ఈఆర్పీ నెట్ 2.0 పనితీరు, ఇబ్బందులపై కూడా సమీక్షించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కోసం తగిన రీతిన సిద్ధం కావాలని ఈసీఐ బృందం స్పష్టం చేసింది.
అయితే 2018 లో డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ జరిగినందున.. ఇప్పుడు కూడా డిసెంబర్ గడువుగా నిర్దేశించుకొని కార్యాచరణ చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చదవండి: