అన్నదాతలకు ఆసరాగా, పెట్టబడి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం భేష్ అంటూ ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వం 2018 ఖరీఫ్ నుంచి దీన్ని అమలు చేస్తోంది. ఎకరాకు సీజన్‌కు ఇచ్చే రూ.4 వేల సాయాన్ని 2019-20లో రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని ఆర్థిక సర్వే వివరించింది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
రైతులకు ఆదాయ పరంగా, పెట్టుబడి పరంగా మద్దతివ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న కాలియా, ఝార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కృషీ ఆశీర్వాద్ పథకాలనూ ఇందులో పేర్కొన్నారు. పీఎం కిసాన్ కింద సన్న, చిన్నకారు రైతులకు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు ఇస్తున్నట్లు వివరించారు.
ఒడిశా, ఝార్ఖండ్‌లో కూడా రైతుకు సాయం
ఒడిశా ప్రభుత్వం కాలియా కింద రైతులకు ఏడాదికి రెండు విడతల్లో అయిదు వేల చొప్పున పది వేలు, భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12,500, వ్యవసాయ కార్మికుల కుటుంబానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఝార్ఖండ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ నిధి కింద మెట్ట భూములకు గరిష్ఠంగా అయిదెకరాల వరకు ఏటా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
తాజాగా ప్రభుత్వం రబీ సీజన్‌కు కూడా నిధులు విడుదల చేసింది. ఖరీఫ్‌లో కొంతమంది రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి.