ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం పార్ బాయిల్డ్ బియ్యం తీసుకోదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ (Central Food and Consumer Affairs)తెలిపింది. వచ్చే రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత.. వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రస్తుత రబీ సీజన్ (Rabi season)ఇంకా ప్రారంభం కాలేదని.. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో డిమాండ్ ఉన్నందున.. ఆయా డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇకపై కొనలేని పరిస్థితి
ఇప్పటికీ వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ సేకరణ జరిగిందని... ఇకపై బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదని కేంద్రం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా వరి, గోధుమ (Rice, wheat crop) పంటను తక్కువగా పండించాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని.. ఇంకా నిల్వ చేసే పరిస్థితి లేదని వెల్లడించింది. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలు, రాష్ట్రాల సేకరణ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే ఈ నిర్ణయం జరిగిందని ప్రకటించింది.
అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకునే..
ప్రస్తుతం ఎగుమతి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని.. వాటిని అనుసరించే ఎగమతి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలి...
రైతులు వరి, గోధుమ పంటలు కాకుండా... ఇతర ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలని కేంద్రం సూచించింది. ఆయిల్, పప్పు ధాన్యాలు (Oil and pulses) ఎక్కువగా పండించాలని సూచించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మీరు ఎంత సేకరిస్తారో అంతకే పరిమితంకండి..
రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతారో.. అంత వరకే పరిమితం కావాలని కేంద్రం తెలిపింది. గత సమావేశంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి సేకరించాలని నిర్ణయం జరిగినట్లు వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కేంద్రం ధాన్యం, బియ్యం సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది. దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలకు సంబంధించిన పంటలపై దృష్టి పెట్టి.. అవకాశం ఉన్న మేరకు దిగుమతులు తగ్గించాలని కోరుతున్నారని పేర్కొన్న కేంద్రం... ప్రస్తుతం దిగుమతి చేసుకునే ఆయిల్, పప్పు ధాన్యాలు, ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: KCR fires on Central Government : 'మా ఓపికకు ఓ హద్దుంటుంది... వడ్లు కొంటరా.. కొనరా..? '