నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను పదుల సంఖ్యలో అమర్చాలని నగర పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పదివేలు, సైబరాబాద్‌లో ఐదువేల కెమెరాలతో పాటు ట్రాఫిక్ వ్యవస్థకు ఉపయోగిస్తున్న హెచ్‌ట్రిమ్స్ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఏడాది పాటు ప్రభుత్వ పరంగా కెమెరాలను ఏర్పాటు చేస్తూ... మరో పక్క వాణిజ్య సంస్థలు, వ్యాపారులు, ప్రైవేటు సంస్థలను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని భావించారు.
సైబరాబాద్ ఐటీ కారిడార్ ఇప్పటివరకూ 60 వేల సీసీటీవీలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఒకే సారి 10 వేల కెమెరాలను తెరపై చూసే అవకాశం ఉందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో కెమెరాలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా ఐటీ బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వ్యాపారస్థులు, నివాసముంటున్న వారి భాగస్వామ్యంతో పోలీసులు సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నా... వాటి నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్... లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు నేలచూపులు చూస్తున్నాయి. పోలీసుల సూచనల మేరకు కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల నేరాలు, దొంగతనాలు చాలా వరకు తగ్గినా... ప్రస్తుతం వాటి పరిస్థితి దారుణంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి