నలుగురు మాజీ ఐఏఎస్, ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాంపల్లి న్యాయస్థానం ఆదేశాల మేరకు మాజీ ఉన్నతాధికారులపై సైఫాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు విద్యాసాగర్, అతని భార్య రత్నప్రభ 2012లో వత్సల అనే మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వత్సలపై కేసు నమోదైంది.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై తప్పుడు కేసు పెట్టారని 2013లో వత్సల... డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని డీఓపీటీ నుంచి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పోలీస్ శాఖ నుంచి వచ్చిన వివరాలతో 2014లో డీఓపీటీకి సీఎస్ నివేదిక సమర్పించారు.
సీఎస్ సమర్పించిన నివేదిక కూడా విద్యాసాగర్, అతని భార్య రత్నప్రభకు అనుకూలంగా ఉందని... అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ విధంగా చేశారని... మూడు నెలల క్రితం నాంపల్లి న్యాయస్థానంలో వత్సల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం... సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్, పీకే మహంతి, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, అప్పటి ఒంగోలు ఎస్పీ కేఎల్ఎన్ రాజుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసిన విద్యాసాగర్, ఆయన భార్య రత్నప్రభపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మాజీ ఐఏఎస్ విద్యాసాగర్‌తో దాదాపు 10 ఏళ్లు కలిసి ఉన్నానని... ఆ తర్వాత విబేధాలు తలెత్తడంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేయించారని వత్సల తెలిపింది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం