బోసినవ్వుల తాత బాపూజీ చిత్రపటాలు గీయడంలో ఒక్కో చిత్రకారుడిది ఒక్కో శైలి. అనంతమైన మహాత్ముడి జీవిత సారాన్ని కొందరు రంగుల్లో ముంచి దిద్దితే... మరికొందరు ఛాయాచిత్రాల రూపంలో ఆవిష్కరించి గాంధీపై తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం కాస్త సహజత్వాన్ని ఉట్టి పడేలా బొమ్మలు గీస్తూ గాంధీకి వీరాభిమాని అనిపించుకుంటున్నారు.
పేరు పామర్తి శంకర్. హైదరాబాద్లో ప్రముఖ కార్టూనిస్ట్. భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్... చిన్నప్పటి నుంచే చిత్రకళపై అభిరుచి పెంచుకొని హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ప్రముఖ చిత్రకారుడు మోహన్ వద్ద శిష్యరికం చేసి కార్టునిస్ట్గా ఎదిగిన శంకర్... పలు దినపత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టునిస్ట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అయినా వ్యక్తిగతంగా తనకంటూ గుర్తింపు లేదని భావించి... హైదరాబాద్ ఆర్ట్ ఫెస్టివల్, తెలంగాణ కళామేళా పేరుతో తన కళను ప్రదర్శించారు. ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. గాంధీ 150వ జయంతిపై శంకర్ దృష్టి మళ్లింది. గాంధీ మాటల స్ఫూర్తితో ఇప్పటి వరకు ఎవరూ గీయని విధంగా మహాత్ముడి చిత్రపటాలను గీస్తూ ఔరా అనిపిస్తున్నారు.
చెన్నై చిత్రకారుడు కె.ఆదిమూలం గాంధీపై గీసిన 100 చిత్రాల రికార్డును బ్రేక్ చేసేందుకు శంకర్ ఐదు నెలలపాటు శ్రమించారు. గాంధీ జీవితం అద్దంపట్టేలా సుమారు 100కుపైగా రేఖా చిత్రాలను సహజత్వానికి దగ్గరగా పెన్సిల్తో గీశారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని వాటిలో అత్యుత్తమమైన 40 రేఖా చిత్రాలతో హైదరాబాద్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నాటికి 150 గాంధీజీ చిత్రపటాలతో దేశవ్యాప్తంగా ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో మరిన్ని మహాత్ముని బొమ్మలు గీసేందుకు శ్రమిస్తున్నారు. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో శంకర్ ఏర్పాటు చేసిన ఈ మహాత్మ 150వ ప్రదర్శన అక్టోబర్ 6 వరకు కొనసాగనుంది.
ఇదీ చూడండి: గాంధీ చేతికర్ర పట్టుకున్న పిల్లవాడు ఎవరో తెలుసా?