సాధించాలన్న తపన, దానికి తగిన కృషి, ప్రణాళిక ఉంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాధించవచ్చు. దీనిని నిజం చేసి చూపిస్తున్నారు నందన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కాల్వపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వీరారెడ్డి, రాజమ్మ దంపతుల చిన్నబ్బాయి ఈయన. అన్నయ్య రమేష్ రెడ్డి అదామా కంపెనీ ఉన్నతోద్యోగి. నందన్ ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలోనే సాగింది. పది, ఇంటర్మీడియెట్ నెల్లూరులో చదివారు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. బీటెక్ పూర్తయ్యాక రెండేళ్ల పాటు పుణేలోని టాటా జాన్సన్ కంట్రోల్స్ కంపెనీలో పనిచేశారు. తర్వాత 2015 వరకు ఆస్ట్రియాలోని మాగ్నాస్టైర్ కంపెనీలో విధులు నిర్వర్తించారు. విడిభాగాలతో పాటు ఏడాదికి 3 లక్షల కార్లు తయారుచేసే సామర్థ్యమున్న సంస్థ ఇది. అందులో పనిచేస్తూనే, కంపెనీ ఆర్థిక సహకారంతో ఆస్ట్రియాలో ఎంఎస్ చేశారు నందన్. విధుల్లో భాగంగా జపాన్, చైనా, పలు ఐరోపా దేశాల్లో పర్యటించారు.
సొంత కంపెనీ
ఆస్ట్రేలియాలో ఉద్యోగానుభవంతో తానూ సొంతగా పరిశ్రమ స్థాపించాలని నందన్‌రెడ్డి అనుకున్నారు. తన ఆలోచనల్ని బీటెక్ క్లాస్‌మేట్ సునీల్ ఎల్లాప్రగడతో పంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునీల్ మెకట్రానిక్స్, డిస్‌ప్లే టెక్నాలజీల్లో ఎంఎస్ పట్టభద్రులు.ఆయన భాగస్వామ్యంతో కడప జిల్లా చింత కొమ్మదిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడలో 2016 ఆగస్టులో ట్రయోవిజన్-కాంపోజిట్ టెక్నాలజీ పరిశ్రమను ప్రారంభించారు నందన్. రూ.9 కోట్ల పెట్టుబడితో ఇది మొదలైంది. ట్రాఫిక్‌బూత్‌లు, విండ్‌మిల్ యంత్రాల రెక్కలు, జారుడు బల్లలు, ఎలక్ట్రికల్ వాహనాలు, మెట్రో రైలు విడిభాగాలు లాంటి ఎన్నింటినో ట్రయోవిజన్ రూపొందిస్తోంది. సునీల్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు.
మా మొదటి ఏడాది టర్నోవర్ రూ.5 లక్షలే. నాలుగేళ్లలోనే దాదాపు రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ప్రస్తుతం సంస్థలో 175 మంది పనిచేస్తున్నారు. 40 మంది ఇంజినీరింగ్ నిపుణులు కాగా, 135 మంది కార్మికులు. వీరందరికీ నెలకు రూ.25 లక్షల వరకూ వేతనాలు చెల్లిస్తున్నాం. వ్యవసాయం, మౌలిక వసతులు, రక్షణరంగం, ఫర్నీచర్ విభాగాల్లో విడిభాగాలు తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం -నందన్ రెడ్డి
ట్రయోవిజన్‌లో తయారైన మెట్రో రైలు విడిభాగాలను కెనడా, సిడ్నీ మెట్రోలకు ఎగుమతి చేస్తున్నారు. మెట్రో విడిభాగాలకు అవసరమైన డిజైన్లు, కాంపోజిట్ తయారు చేయడానికి రూ.2.50 కోట్లు వెచ్చించి జర్మనీ టెక్నాలజీతో తయారైన రోబోటిక్ మిల్లింగ్ మిషన్‌ను తెప్పించారు. ఎనిమిది కోణాల్లో, 360 డిగ్రీల్లో తిరుగుతూ 15 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పున్న థర్మోకోల్, చెక్క సామగ్రిని డిజైన్ చేయగల ఈ మిషన్ దేశంలోనే మొదటిదని చెబుతారు నందన్. విడిభాగాలే కాకుండా హైదరాబాద్‌లోని లష్ సంస్థకు ఓ ఎలక్ట్రికల్ వాహనాన్ని ట్రయోవిజన్ తయారుచేసి ఇచ్చింది. వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌కు అవసరమైన ఇంటీరియర్ టూలింగ్ కూడా అందించింది. బెంగళూరు ట్రాఫిక్ బూత్‌లు ఇక్కడే తయారవుతున్నాయి. పుణే, ముంబయి, చెన్నై, సింగపూర్, ఫ్రాన్స్, అమెరికాల నుంచి ట్రయోవిజన్‌కు ప్రస్తుతం ఆర్డర్లున్నాయి. నందన్ భార్య ప్రసన్న లక్ష్మి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. పుణేలోని ట్రయోబోటిక్స్ ఆటోమేషన్ సొల్యూషన్ కంపెనీకి ఈమె డైరెక్టర్. రోబోటిక్ యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడి కంపెనీలకు విక్రయిస్తుందీ సంస్థ. దీనితో ఉన్న అవగాహనా ఒప్పందంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు రోబోటిక్ మిషన్లు అమర్చి వచ్చింది ట్రయోవిజన్. తయారీరంగంలో తెలుగునాడు ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఈ సంస్థ.. దాని వెనక ఉన్న నందన్ స్వప్నం.. ‘కలలు కనండి- వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించండి’ అన్న అబ్దుల్ కలాం మాటలకు ఆచరణీయ రూపాలు!
ఇదీ చదవండి: న్యూరో చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి వరవరరావు