Call Centre for Woman Safety: మహిళలపై వేధింపులను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆకతాయిలపై మరో అస్త్రాన్ని సంధించనుంది. మహిళలు, యువతులకు ఫోన్ కాల్స్ ద్వారానే ఎక్కువ వేధింపులు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన పోలీస్ శాఖ ఆ తరహా వేధింపులకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి మహిళలకు అండగా నిలవాలని నిర్ణయించింది. షీ బృందాలకు చిక్కుతున్న పోకిరీల వివరాలతో మహిళా భద్రత విభాగం ఇప్పటికే డేటా రూపొందిస్తోంది. వేధింపుల కేసులో చిక్కిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
తొలుత ఫోన్ వార్నింగ్
Call Centre for Woman Safety in Hyderabad : అయితే, ఈ కొత్త విధానం ప్రకారం కౌన్సెలింగ్‌కు ముందు కాల్‌సెంటర్ సిబ్బంది రంగంలోకి దిగుతారు. తమను వేధిస్తున్నారంటూ వచ్చే ఫిర్యాదులను షీ బృందాలు తొలుత కాల్‌సెంటర్‌కు మళ్లిస్తాయి. వెంటనే ఆ ఆకతాయి సెల్‌ఫోన్‌కు కాల్‌సెంటర్ నుంచి పిలుపు వెళ్తుంది. ‘‘మీరు ఓ మహిళను ఫోన్‌లో వేధిస్తున్నారు. ఇలా చేయడం తప్పు. పద్ధతిని మార్చుకోండి.. లేకపోతే కఠినశిక్ష తప్పదు..’’ అని తొలుత హెచ్చరిస్తారు. అయినా వినకపోతే కేసు నమోదు చేసి శిక్షిస్తారు. శిక్షల పర్యవసానాల గురించి టీనేజీ యువకులకు అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది దారి తప్పుతున్నారని మహిళా భద్రతా విభాగం గుర్తించింది. దీంతో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి వారికి తొలుత అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఫోన్ వేధింపులు అధికం కావడంతోనే..
Call Centre for Woman Safety in Telangana :ఇటీవలి కాలంలో మహిళలను సెల్‌ఫోన్ ద్వారా ఎక్కువగా వేధిస్తున్నారు. పోకిరీలు ఏదో విధంగా ఫోన్ నంబర్లను సేకరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటి వారి నుంచి మహిళలను రక్షించడానికే ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. -- సుమతి, డీఐజీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం
ఇదీ చదవండి: Family suicide in Vijayawada case: ఏపీలో తెలంగాణ వాసుల ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు