రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదవడంతో.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా అత్యవసరంగా ఉదయం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సభ్యులు. వీరి నేతృత్వంలో పంచాయతీరాజ్, పురపాలక, విద్య, సమాచార ప్రజా సంబంధాలు, రవాణా, పోలీసు, రెవెన్యూ, పర్యాటక శాఖలతో నిర్వహించనున్న ఈ సమన్వయ సమావేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తారు.
వందలు, వేల సంఖ్యలో ప్రజలు గుమికూడడానికి అవకాశముండే పాఠశాలలు, కళాశాలల వంటి చోట్ల వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు సత్వర చర్యలు చేపట్టనున్నారు.