ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో నగరంలో మొట్ట మొదటిసారిగా బస్ షెల్టర్ నిర్మాణం అందుబాటులోకి రాబోతోంది. ఈ నిర్మాణానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా శ్రీకారం చుట్టునున్నాయి. కవాడీగూడ ప్రధాన రహదారిలో ఈ నిర్మాణం కొనసాగనుంది. వ్యర్థ పదార్థాలతో నిర్మించనున్న మొట్టమొదటి బస్ షెల్టర్‌గా హైదరాబాద్ మహానగర చరిత్రలో ఇది నిలిచిపోనుంది. దీని నిర్మాణానికి ఎన్టీపీసీ సహకారం అందిస్తున్నది.
ప్లాస్టిక్‌తోనే నిర్మాణం
మెటల్ ఫ్రేమ్ మినహాయిస్తే... రూఫ్, సీలింగ్, వాల్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, రెయిలింగ్ ఇలా అన్నీ పునర్వినియోగ ప్లాస్టిక్‌తోనే నిర్మించనున్నారు. ఈ పూర్తి యూనిట్‌ను గుజరాత్ రాష్ట్రంలోని పునర్వినియోగ ప్లాస్టిక్ బిల్డింగ్ మెటీరియల్ తయారీ సంస్థలో చేస్తారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సుమారు రూ.7లక్షల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మాణం చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన వెల్లడించారు.
25 ఏళ్ల వరకు చెక్కు చెదరని నిర్మాణం
ఈ నిర్మాణంలో ఐదు లక్షలకు పైగా వాడిపడేసిన పాల పాకెట్లను వినియోగించనున్నారు. 12 వందల కిలోల బరువు కల్గిన ఈ యూనిట్‌కు మంటలు, నీరు, వేడిమి వల్ల ఎలాంటి ప్రమాదం లేదా నష్టం జరిగే అవకాశాలు ఉండవని నిర్మాణదారులు అంటున్నారు. దీని నిర్మాణంలో వినియోగించే వ్యర్థాలతో మనుషులకు పర్యవరణానికి ఎటువంటి హాని ఉండదంటున్నారు. సుమారు 25 యేళ్ల వరకు ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుందని హామీనిస్తున్నారు. షెల్టర్ పై భాగంలో ఒక కిలోవాట్ విద్యుత్ నిల్వ సామర్థ్యం కలిగిన సోలార్ పానెల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. షెల్టర్ ప్రకటన బోర్డు, లైటింగ్, చార్జింగ్ పాయింట్లకు అవసరమైన విద్యుత్ సరఫరా దీని ద్వారా అందుతుంది.
ప్లాస్టిక్ పునర్వినియోగంతో నిర్మించనున్న ఈ బస్ షెల్టర్ అందుబాటులోకి వస్తే... ఇటువంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టవచ్చని జీహెచ్ఎంసీ యోచిస్తోంది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం