R.S.PRAVEEN KUMAR: ఉస్మానియా ఐకాస అధ్యక్షుడు, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ సాంబశివగౌడ్ బీఎస్పీలో చేరారు. తన అనుచరులతో కలసి ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ హుజూర్నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాంబశివగౌడ్ను ప్రకటించారు.
ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలైతే.. భోగాలు మాత్రం ఆధిపత్య కులాల వారు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ అట్టడగు వర్గాలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్నీ కాలగర్భంలో కలపాలని కొందరు కపట పాలకులు కుట్రలు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆ కుట్రలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇందుకోసం మేధావులు, బుద్ధిజీవులు తమతో కలసి రావాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: ChinnaJeeyar Swami: ముఖ్యమంత్రితో ఎలాంటి విభేదాలు లేవు: చినజీయర్ స్వామి