BRS Party Expansion Plans : భారత్ రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి సందడి సద్దుమణగగానే దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మంలో ఆవిర్భావ సభ తర్వాత జోరు పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ఇటీవలే నియమించిన కేసీఆర్.. ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా చేరికలుంటాయని ఇటీవలే కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాల నుంచి 70 మందికి పైగా నాయకులు కేసీఆర్‌ను కలిసి స్థానికంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుంచి చేరికలుంటాయని శ్రేణులు చెబుతున్నాయి.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్.. ముందుగా రైతు విభాగాలను పటిష్టం చేసేలా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కిసాన్ విభాగం అధ్యక్షుడిగా హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింగ్ చడూని ఇప్పటికే నియమించారు. నెలాఖరు నాటికి తెలంగాణ, ఏపీతో పాటు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలో కిసాన్ విభాగాలు ప్రారంభించేలా కసరత్తు పూర్తి చేశారు.
ఇప్పటికే దిల్లీలో కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్.. త్వరలో మరోసారి దిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాలు, సంఘాల ప్రతినిధులు, మేధావులు, విశ్రాంత అధికారులు పార్టీలో చేరేలా సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ పాటలు, పుస్తకాలు, కళా ప్రదర్శనలు రూపొందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కన్నడ, ఒరియా, మరాఠా, తదితర భాషల కవులు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.
దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన గుణాత్మక మార్పులు బీఆర్ఎస్ లక్ష్యాలు, ఉద్దేశాలను వివిధ రాష్ట్రాల్లోని సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా వివరించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై గులాబీ దళపతి ప్రత్యేక దృష్టి సారించారు.
ఇవీ చదవండి: