BRS focus on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లో ఆశావహుల దూకుడు పెరుగుతోంది. ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మంది నాయకులున్న నియోజకవర్గాల్లో విభేదాలు అధికమవుతున్నాయి. ఇప్పటికే పోటాపోటీ కార్యక్రమాలతో ఎవరికి వారు సొంతవర్గాలను పెంచుకుంటున్నారు. పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారు. ఇలాంటి వారిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. కొందరు నాయకులను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మరికొందరిని కేటీఆర్, హరీశ్‌రావులు పిలిపించుకుని సర్దిచెబుతున్నారు. పద్ధతి మారకుంటే బాగోదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. పార్టీ మారే ఆలోచన చేస్తున్న వారికి నచ్చజెప్పే పనిని పలువురు మంత్రులకు అప్పగించారు.
BRS Party Latest News : రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీల మధ్య... ఎమ్మెల్యేలకు, జడ్పీ ఛైర్మన్ల మధ్య... ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ల కోసం పంతం పెరుగుతోంది. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ సమస్యలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై వరుసగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం, శ్రీహరీ గట్టిగానే ప్రతి విమర్శలకు దిగడంతో వివాదం తీవ్రమైంది. దాంతో రాజయ్యను కేటీఆర్ పిలిపించి మాట్లాడాక వాతావరణం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
BRS MLA Tickets Issue Telangana : అలాగే మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోనూ విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ వర్గీయులు మహబూబాబాద్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వొద్దని కోరారు. మరో మేజర్ గ్రామపంచాయతీలోని నాయకులూ ఇలాంటి సమావేశమే నిర్వహించారు. పార్టీ నాయకత్వం ఇక్కడ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి సత్యవతి రాఠోడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. డోర్నకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు వ్యతిరేకంగా పార్టీలోనే మరో వర్గం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఆయన కూతురే కేసులు పెట్టడం, నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్సీ ఒకరికి ఈ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
ఆ జిల్లాలో విభేదాలు పెంచిన కొత్త మండలం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేల మధ్య వైరం నెలకొంది. బోథ్ నియోజకవర్గంలో కొత్త మండలంగా సొనాల ఏర్పాటు విషయంలో ఇది మరింత తీవ్రమైంది. మాజీ ఎంపీ నగేష్ బోథ్ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని, ఆయనకు జోగు రామన్న మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్‌పర్సన్ కోవా లక్ష్మి వర్గీయులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి కోవా లక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ముథోల్, నిర్మల్‌లలోనూ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.
ఉమ్మడి పాలమూరులో గరంగరం : ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో అచ్చంపేట నుంచి ఎంపీ రాములు టికెట్ ఆశిస్తున్నారు. తనకైనా, తన కుమారుడికైనా ఇవ్వాలని కోరుతున్నారు. అలంపూర్ నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. గద్వాలలో ఎమ్మెల్యేకు పోటాపోటీగా జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత కార్యక్రమాలు నిర్వహించారు. తనకు భారాస టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలను కలిశారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. మక్తల్‌లో ఎమ్మెల్యేకు పోటీగా జగన్నాథరెడ్డి సొంత డబ్బుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
వేములవాడలో ఇలా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో చలిమెడ లక్ష్మీనరసింహారావుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్‌బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ... ఇటీవల నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. పలువురు బహిరంగంగా తమతమ గ్రూపులతో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, పలుచోట్ల చాపకింద నీరులా చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి అన్ని నియోజకవర్గాలపైన పార్టీ అధిష్ఠానం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.
ఇవీ చదవండి :