BRS MLA Candidates Second List 2023 : ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి.. మిగతా నాలుగింటిపై స్పష్టతకు వచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో.. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటనకు ముందే జనగామ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLC Palla Rajeshwar Reddy).. వర్గాలుగా విడిపోవడంతో నియోజకవర్గ రాజకీయాలు(BRS MLA Ticket Issues) ఒక్కసారిగా రచ్చకెక్కాయి.
కొన్నిరోజుల క్రితం.. పల్లాకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో ప్రగతిభవన్ సమీపంలోని హరిత ప్లాజాలో భేటీ కాగా.. మరుసటి రోజున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులు సమావేశమయ్యారు. నేటికీ నియోజకవర్గంలో రోజూ పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు భగ్గుమనడంతో.. అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది. జనగామ టికెట్‌పై ఆశలు పెట్టుకుని కొంతకాలంగా అక్కడ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అభ్యర్థిత్వంపై కసరత్తు చేసిన బీఆర్ఎస్ నాయకత్వం.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
BRS MLA Ticket Issues Telangana 2023 : నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ నెలకొంది. వయస్సు రీత్యా మదన్‌రెడ్డికి బదులుగా.. సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మదన్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ.. ఆయన మద్దతుదారులు మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలను కలుస్తున్నారు. మదన్‌రెడ్డికి నచ్చచెప్పి.. లేదా ఏదైనా ఇతర పదవి ఇచ్చి సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్ ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
గోషామహల్ టికెట్‌ను పలువురు నేతలు ఆశిస్తున్నారు. సుమారు ఆరుగురు నేతలు ఆశిస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాఠోడ్, నియోజకవర్గం ఇంఛార్జీ నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రేంసింగ్ రాఠోడ్ 2018లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పోటీ చేసిన అభ్యర్థులకే మళ్లీ ప్రాధాన్యమిచ్చినందున.. మళ్లీ టికెట్(BRS MLA Tickets 2023) ఇస్తారని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే ప్రేంసింగ్ రాఠోడ్ వయసును దృష్టిలో ఉంచుకొని నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేరు పరిశీలిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
ఆ స్థానాలు ఖరారు చేసిన తర్వాతే సీఎం సమావేశం : నాంపల్లిలో బీఆర్ఎస్ సీరియస్ పోటీలో లేకపోయినా.. ఎందుకు ప్రకటించలేదనే విషయం పార్టీ వర్గాల్లో కొంత అయోమయం నెలకొంది. గోషామహల్, నాంపల్లి టికెట్‌పై.. ఎంఐఎం అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నాంపల్లి టికెట్ మళ్లీ తనకే దక్కుతుందని గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్‌గౌడ్ ధీమాతో ఉన్నారు. ఈ నెల 30న ఆ 4 స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. నాలుగు స్థానాలు ఖరారు చేసిన తర్వాత అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్టీలోని అసంతృప్తులతో వ్యవహరించాల్సిన తీరు.. ప్రచార ప్రణాళికలు, విపక్షాలపై స్పందించాల్సిన అంశాలు.. తదితర ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Telangana Assembly Elections 2023 : మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును ప్రకటించినా.. మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలపై వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేటీఆర్, కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. మైనంపల్లి టికెట్ విషయంలో బీఆర్ఎస్ పునరాలోచిస్తోందని ప్రచారం సాగుతుండగా.. ఆయన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావును మార్చాల్సి వస్తే.. ఆ టికెట్ కోసం మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.