BRS Manifesto 2023 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న పథకాలను కొనసాగిస్తూనే 6 నెలల్లోనే కొత్త హామీలను అమలు చేస్తామని చెప్పారు. అన్నివర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకున్నామన్న ఆయన.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, దానిని పేదలకు పంచడమనే విధానంతోనే తమ ప్రభుత్వం తొలి నుంచీ వ్యవహరిస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే మరోసారి అధికారం చేపట్టాక ఆసరా పింఛన్లు, వికలాంగుల పింఛన్లను పెంచుతామని ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అందిస్తున్న ఆసరా పింఛన్ రూ.2016 నుంచి రూ.5016కు పెంచుతామని కేసీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రూ.3016కు పెంచుతామన్నారు. ఏటా రూ.500 చొప్పున పెంచుతూ.. ఐదేళ్లలో రూ.5016 అందిస్తామని స్పష్టం చేశారు. వీటితో పాటు దివ్యాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచుతామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం వీరికి రూ.4016 అందిస్తుండగా మూడోసారి అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలో రూ.5 వేలకు పెంచి.. ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలు అందిస్తామని వివరించారు.
మరోవైపు రైతుబంధు సాయం మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు సాయం కింద ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందిస్తుండగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతామన్నారు. ఈ పెంపు ఒకేసారి కాకుండా దశల వారీగా చేస్తామని తెలిపారు. తొలి ఏడాది రైతు బంధు కింద రూ.12 వేల సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3వేల చొప్పున భృతి చెల్లిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు.
BRS MLA Ticket Issue in Gadwal : బీఆర్ఎస్లో అసమ్మతుల సెగ.. అలంపూర్ టికెట్ ఎవరికి ?
దశల వారీగా ఆసరా పింఛన్ల మొత్తం పెంచుతాం. మొదటి ఏడాది రూ.3 వేలకు పెంచి.. ఏటా రూ.5 వందల చొప్పున రూ.5వేలు అందిస్తాం. దివ్యాంగుల పింఛను రూ.6 వేల వరకు పెంచుతాం. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5 వేలకు పెంచి, ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుకుంటూ ముందుకు సాగుతాం. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తాం. రైతు బంధు మొత్తం దశల వారీగా రూ.16 వేల వరకు అందిస్తాం. - సీఎం కేసీఆర్
రాష్ట్రంలో పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో పరిశీలించి.. వాటినీ చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే మరోసారి ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నామని.. తాము ఇచ్చిన ఈ హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన 6, 7 నెలల్లో అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..